రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం

హైదరాబాద్ :‌

తెలంగాణ విషయంలో పది కోట్ల మంది రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్ అధిష్టానం చెలగాటం ఆడుతోందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎం‌.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ‘కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి మూలస్తంభంగా నిలిచిన రాష్ట్రం మనది. రెండుసార్లు అత్యధిక ఎంపీలను ఇచ్చిన రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడటం దారుణం’ అని శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తంచేశారు.

‘ఈ నెల 12న జరిగిన కోర్‌కమిటీ సమావేశం అనంతరం సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని, సీడబ్ల్యుసీలోనే తెలంగాణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించారు. మళ్లీ ఇదే అంశంపై రెండ‌వసారి శుక్రవారం కోర్ కమిటీ సమావేశంలో చర్చించడమేమిటి? ఆ తర్వాత కూడా దిగ్విజ‌య్ మాట్లాడుతూ.. చర్చల్లేవు.. ఇక పార్టీ, ‌యుపిఎ ప్రభుత్వ నిర్ణయమే తరువాయి అని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇలా రాష్ట్ర ప్రజలను ఎందుకు గందరగోళంలో పడేస్తున్నారు’ అని ప్రశ్నించారు.

తన వైఖరేమిటో కాంగ్రెస్‌ పార్టీ చెప్పకుండా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నందుకు నిరసనగానే తమ పార్టీ శాసనసభ్యులు పదవులకు రాజీనామా చేశారని మేకపాటి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఇతర పక్షాల ముందుంచి చర్చలు జరపకుండానే సంప్రదింపులు ముగిశాయని చెప్పడం సరైనదేనా అని ప్రశ్నించారు. పది కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇలా ఆటలాడటం శోచనీయమని చెప్పారు.

Back to Top