షర్మిల సమైక్య శంఖారావంను సక్సెస్ చేయాలి

నెల్లూరు :

నెల్లూరు జిల్లాలో ఆదివారం శ్రీమతి షర్మిల నిర్వహించే సమైక్య శంఖారావం బస్సుయాత్రను విజయవంతం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీమతి షర్మిల బస్సు యాత్ర నేపథ్యంలో నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ‌రాజమోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. నాయకులందరూ వచ్చి బద్వేలు నుంచి వచ్చే శ్రీమతి షర్మిలకు జిల్లా సరిహద్దులో ఘనంగా స్వాగతం పలకాలన్నారు. జిల్లాలో జరిగే శ్రీమతి షర్మిల సభలను అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎం.పి. రాజమోహన్ మాట్లాడారు.‌ శ్రీమతి షర్మిల బస్సుయాత్ర 8వ తేదీ ఉదయం బద్వేలు నుంచి జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. 10 గంటలకు ఆత్మకూరులో జరిగే సభలో ఆమె ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం సంగం మీదుగా బుచ్చిరెడ్డిపాళెం వచ్చి అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారన్నారు. సాయంత్రానికి కావలి చేరుకుని అక్కడ సభలో మాట్లాడతారని తెలిపారు. రాత్రికి కావలిలో బసచేస్తారని ఎంపీ చెప్పారు. పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై శ్రీమతి షర్మిల యాత్రను విజయవంతం చేయాలన్నారు. విడిపోతే సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంది కాబట్టే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top