సంతాప సభను రాజకీయసభగా మార్చారు

చంద్రబాబువి శవరాజకీయాలు
ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌
శాసనసభలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానంలో తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంతనూతనపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన తరువాత భూమాపై కపట ప్రేమ చూపిస్తున్న ఇదే చంద్రబాబు భూమా నాగిరెడ్డిని విషపు మొక్కగా మాట్లాడారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వైఖరితో చట్టసభ అపవిత్రమైందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఫిరాయింపుల దారులతో ప్రతిపక్ష పార్టీని తిట్టించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరిన డేవిడ్‌ రాజు, చాంద్‌బాషాలు వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీలో సభాపతి సాక్షిగా బీఫాం ఇచ్చి గెలిపించిన పార్టీపై విమర్శలు గుప్పించిన ఇద్దరు శాసనసభ్యులపై ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు రాదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుదారులపై అనేక ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు డేవిడ్‌రాజు, చాంద్‌బాషాలు మాట్లాడిన క్లిప్పింగ్‌లను రిలీజ్‌ చేసి తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. 

మనస్థాపం వల్లే భూమా చనిపోయారు
ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి
చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని ఆశచూపి సంవత్సరంకాలం తరువాత మొండి చెయ్యి చూపడంతోనే భూమా మనస్థాపానికి గురై మృతి చెందారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చట్టసభలో జరుగుతున్న భూమా సంతాపసభ టీడీపీ రాజకీయ సభగా మారడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ను విమర్శించడానికే సంతాప సభలో సమయం కేటాయిస్తున్నారని మండిపడ్డారు. శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోతే వైయస్‌ జగన్‌ కుటుంబం మొత్తం వెళ్లి భూమా కుటుంబాన్ని పరామర్శించిందన్నారు. భూమా నాగిరెడ్డి మృతిపట్ల వైయస్‌ జగన్‌ కుటుంబ సభ్యుడిని కోల్పోయానని చెప్పారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో భూమాకు క్యాబినెట్‌ హోదా పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చి గౌరవించామన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చల అనంతరం 24 గంటలలోపే భూమా చనిపోవడం దురదృష్టకరమన్నారు. తండ్రి చనిపోయి దుఖంలో ఉన్న అఖిలప్రియను సభకు తసుకురావాల్సిన అవసరం ఏముందని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి చిత్రవధ చేసిందన్నారు. 

ఏ సంస్కారంతో ఫిరాయింపులు ప్రోత్సహించారు
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
ఏపీ అసెంబ్లీ:  చంద్రబాబుకు ఏ సంస్కారం ఉందని ఫిరాయింపులను ప్రోత్సహించారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. భూమా సంతాప సభకు వైయస్‌ఆర్‌సీపీ హాజరు కాలేదని టీడీపీ నాయకులు విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. మీడియా పాయింట్‌లో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమన్నారు. రెండేళ్ల వ్యవధిలో శోభానాగిరెడ్డి, నాగిరెడ్డి మరణించడం అందరిని కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమా మరణించిన వెంటనే మానవతాదృక్పథంతో వైయస్‌ జగన్, వైయస్‌విజయమ్మ ఫోన్‌ చేసి అఖిలప్రియను ఓదార్చారని తెలిపారు. ఆ కుటుంబం బాధలో మేం కూడా పాలుపంచుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో భూమా సంతాప సభలో వైయస్‌ జగన్‌ను తిట్టడానికి సమయం కేటాయించడం దురదృష్టకరమన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రారంభం నుంచి భూమా కుటుంబం కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. వారి సేవల పట్ల గౌరవంతోనే వైయస్‌ జగన్‌ ఆదరించారని గుర్తు చేశారు.  చాలా ప్రతిష్టాత్మకమైన కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాలు ఆ కుటుంబానికి కేటాయించారని, శోభా మరణించిన సందర్భంలో కూడా ఒక కుటుంబ సభ్యురాలిని కోల్పొయినపుడు వైయస్‌ జగన్‌ చాలా బాధపడ్డార ని తెలిపారు.  యావత్తు కుటుంబం కూడా భూమా కుటుంబానికి అండగా నిలిచిందని చెప్పారు. వారి సేవలను గుర్తించాల్సిన విషయం టీడీపీ నేతలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. ఏ సంస్కారం ఉండబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలను ఫిరాయించారని ప్రశ్నిస్తున్నారు. ఏ సంస్కారం ఉండబట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలతో తిట్టించారని  నిలదీశారు. వారు పార్టీ ఫిరాయించడం అనైతికమని మా పార్టీ భావిస్తోందన్నారు. ఆ విషయంలో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. మా పార్టీ గుర్తుపైన గెలిచి పార్టీ ఫిరాయించడం మమ్మల్ని బాధించిందన్నారు. పార్టీ మారిన వారిని అనర్హులుగా గుర్తించాలని పోరాటం చేస్తున్నామని, ఇలాంటి సందర్భంలో సంతాప సభలో నటించడం సరికాదని తెలిసి దూరంగా ఉన్నామన్నారు. మంచి ఉద్దేశంతోనే హుందాగానే సంతాప సభకు హాజరుకాలేదు అన్నారు. వ్యక్తిగతంగా వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తున్నామన్నారు.. దీన్ని చిలువలు, పలుకులు చేయకుండా హుందాగా వ్యహరించాలని సూచిస్తున్నామన్నారు. ఉప ఎన్నికకు సంబంధించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.


Back to Top