విలీన గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు ఇవ్వాలి

నెల్లూరు: నగర కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలకు అధిక నిధులు కేటాయించాలని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని 32వ డివిజన్‌లో ఎమ్మెల్యే ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..నగర కార్పోరేషన్‌లోకి నూతనంగా 15 గ్రామ పంచాయతీలను విలీనం చేశారన్నారు. విలీన గ్రామాల్లో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. డ్రైనేజీ, అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే విలీన గ్రామాలపై నగర కార్పొరేషన్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధిక నిధులు కేటాయిస్తే ప్రజలకు మౌలిక వసతులు సమకూరుతాయని అభిప్రాయపడ్డారు. విలీన గ్రామాల అభివృద్ధికి ఇప్పటికే చాలా సార్లు వినతిపత్రాలు అందించానని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు కూకాటి ప్రసాద్, స్థానిక కార్పొరేటర్‌ కమల్‌ రాజ్, ఎస్‌కే ఖాదర్‌బాషా, హరి, బత్తుల కృష్ణ, డాక్టర్‌ సత్తార్, బాషా, మునాఫ్, తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top