రెండేళ్లలో విచ్చలవిడిగా అవినీతి

ప్రజా సంక్షేమానికి విరుద్ధమైన పాలన
మోసపూరిత హామీలతో నయవంచన
పాలనలో టీడీపీ ఘోర వైఫల్యం
వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్‌: గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఘోరమైన వైఫల్యాలు, చెడు సాంప్రదాయాలు, అసత్యపు ప్రచారాలు తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్షమైన బీజేపీతో రాష్ట్ర అవసరాలన్ని ఒప్పించ గలుగుతాం అని చెప్పి...ఇప్పుడు  నిధులు సాధించలేకపోయామని, బీజేపీ సహకరించలేదని చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కిందిస్థాయి నుంచి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల వరకు అవినీతిని ప్రోత్సహించారని ఫైరయ్యారు. ప్రజల చేత ఎన్నుకోబడిన గడిచిన ప్రభుత్వాలు పాలనకు సంబంధించి ఉత్తమమైన సంప్రాదాయాలు తీసుకువస్తే ఆ ప్రజాస్వామ్య పద్దతులను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. 

ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా జరుగుతున్న అవినీతిని నిరోధించే వ్యక్తులు ప్రభుత్వంలో లేరని, అంతా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అదే ప్రభుత్వంపై ప్రజల్లో విసుగుకు దారితీసిందని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన సంక్షేమానికి పాటుపడతామని చెప్పిన ప్రభుత్వం నిరుపేదలకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టలేదని పేర్కొన్నారు. బీదవాడికి పక్కా ఇళ్లు మంజూరు చేశారా..? ఒక సెంటుభూమినైనా నిరుపేదలకు ఇచ్చారా అని చంద్రబాబును ప్రశ్నించారు. నిరుపేదల జీవన ప్రమాణాలు పెరగడానికి ఒక్క కార్యక్రమం చేపట్టకపోగా ఉన్న సంక్షేమ పథకాలను కూడా ఏ విధంగా తొలగించాలా అని ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. రేషన్‌లో ఒక నెల తీసుకోకపోతే ఇంకో నెల కూడా రేషన్‌ సరుకులు కట్‌ చేస్తూ కొన్ని వేలాది టన్నుల బియ్యాన్ని వెనక్కులాగేసుకుంటుందని దుయ్యబట్టారు.

నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం విరుద్ధంగా పనిచేస్తుందని ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ఒక బీద కుటుంబంలోని విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్టు ఇవ్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. ఆ బీద విద్యార్థి చదువును మధ్యలోనే నిలిపివేసి తల్లిదండ్రుల నిస్సాహయకస్థితిని, బీదరికాన్ని అర్థం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించలేని స్థితికి దిగజారిపోయారన్నారు. ఆరోగ్యశ్రీ నీరుగార్చేశారు. అన్ని విధాల ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం విరుద్ధమని అందుకు ఈ రెండు సంవత్సరాల పాలన రుజువు చేశారన్నారు. 

రైతులు బ్యాంకులకు దూరమయ్యారు
చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలతో రెండు సంవత్సరాల కాలం నుంచి రైతులు బ్యాంకులకు దూరమైపోయారని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. వడ్డీలు పెరిగిపోయి వారికి అగాదం ఏర్పడిందన్నారు. అధిక వడ్డీలకు ప్రైవేట్‌ వ్యక్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి తీసుకువచ్చారని ప్రభుత్వంపై ఫైరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో డ్వాక్రామహిళలకు  20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇప్పించి...కుటుంబంలోని మహిళలు  తానుకూడా సంపాదించగలనన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రభుత్వాలు పెంపొందించాయన్నారు. నేడు బ్యాంకులకు, డ్వాక్రా సంఘాలకు సంబంధాలు తెగిపోయాయన్నారు. 

డ్వాక్రా సంఘాలను కూడా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలకు పూర్తిగా నిరుత్సాహం, నిసృహలోకి కొట్టుకుపోయాయన్నారు. ఒక వైపు రాష్ట్రంలో 10.5 జీడీపీ ఉందని చెబుతూ మరో వైపు హామీలను అమలు చేయడానికి డబ్బులేదని చెప్పడం దుర్మార్గమన్నారు. అదే విధంగా కిందిస్థాయి సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు. గ్రామ పంచాయతీ, మండల కేంద్రాలను పనిచేయనివ్వకుండా రాష్ట్ర స్ధాయినుంచే నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. రెండు సంవత్సరాల కాలంతో ప్రజలు ఇచ్చిన అవకాశం 40 శాతం పూర్తయిందని చంద్రబాబు గ్రహించుకోవాలన్నారు. రెండు సంవత్సరాల్లో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఒక్క ట్రాక్‌లైన్‌ కూడా ఏర్పర్చలేకపోయారని పేర్కొన్నారు. 

రూల్స్‌కు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్నారన్నారు.  చట్టాలు, విధాన నిర్ణయాలు అమలు చేయడంలో బాబు, మంత్రులు దిగజారిపోయారన్నారు. ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న గౌరవం పోయిందన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలో ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లను పనిచేయకుండా కిరికిరి(జన్మభూమి) కమిటీలను నియమించి ప్రజల అభిప్రాయాలను తొక్కిపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను హింసిస్తున్నట్లుగా చంద్రబాబు భావిస్తున్నాడని, రాష్ట్ర ప్రజలనే హింసిస్తున్నాడని చంద్రబాబు గ్రహించలేకపోతున్నారని దుయ్యబట్టారు. గడిచిన 65 సంవత్సరాలుగా ప్రభుత్వాలు నెలకొల్పిన సంప్రదాయాలు పాతిపెడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు సాధించిన ఎన్నో విజయాలను తూడిచిపెట్టి ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. ఇది ఘోరమైన వైఫల్యం కింద ఈ రెండు సంవత్సరాలను చూడాల్సివస్తుందన్నారు. మిగిలిన మూడు సంవత్సరాల్లో ఆత్మపరిశీలన చేసుకొని సరైన పరిపాలన వైపు మొగ్గు చూపాలని హితవుపలికారు. 

Back to Top