సత్తెనపల్లి (గుంటూరు జిల్లా), 4 మార్చి 2013: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అవినీతి, సి.ఎం. కిరణ్‌కుమార్‌రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ముంచుకువచ్చిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తూర్పారపట్టారు. 1995-96లో గ్యాస్, నాఫ్తా విద్యుత్ ప్రాజెక్టులను చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టులు ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నాయని ఆమె అన్నారు. ఆ ప్రాజెక్టుల మంజూరులో అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు చంద్రబాబు నాయుడు సిద్ధమా? అని శ్రీమతి విజయమ్మ సవాల్ చేశారు. బొగ్గు డిమాండ్, జలాశయాల్లో నీటి లభ్యతల గురించి కిరణ్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. అదనపు విద్యుత్ కొనుగోలు చేయాలని ట్రాన్సుకో కోరినా కిరణ్ కుమార్‌రెడ్డి వినలేదని ఆరోపించారు. రాష్ట్రంలో విధించిన అసాధారణ విద్యుత్ కోతలు, కరెంటు చార్జీలకు నిరసనగా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త ధర్నాలు, నిరసన కార్యక్రమాల పిలుపు మేరకు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్వహించిన మహాధర్నాలో శ్రీమతి విజయమ్మ పాల్గొన్నారు. ఈ ధర్నాకు హాజరైన వేలాది మంది రైతులు, స్థానికులు, పార్టీ అభిమానులు, శ్రేణులను ఉద్దేశించి శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు.
ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా పవర్ హాలిడే పెట్టిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ విమర్శించారు. విద్యుత్ కోతల వల్ల కొన్ని వేల పరిశ్రమలు, లక్షలాది కుటీర పరిశ్రమలు మూతపడ్డాయని, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో 12 గంటలు కరెంట్ కోతలు విధించడాన్ని ఆమె తప్పుపట్టారు. రైతులు నేడు కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి దాపురించిందని వాపోయారు. విద్యుత్ సర్‌చార్జీల పేరుతో ఈ ప్రభుత్వం రూ. 32 వేల కోట్ల ఆర్థిక భారాన్ని ప్రజలపై వేసిందని నిప్పులు చెరిగారు.
ఈ ప్రభుత్వం నిద్రపోతోందా?:విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం నిద్రపోతోందా అని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. కేంద్రం నుంచి గ్యాస్ వాటా పొందడం, బొగ్గు తదితర అనుమతులు సాధించలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన మహా అపరాధమని ఆమె వ్యాఖ్యానించారు. మహానేత వైయస్‌ఆర్ బతికి ఉన్నట్లయితే చేసిన వాగ్దానం ప్రకారం తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను రైతులకు ఇచ్చి ఉండేవారని ఆమె అన్నారు. తుఫాన్‌ల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందడంలేదని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు కూడా ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీయని పరిస్థితి నెలకొందని అన్నారు.
చరిత్రలో లేనంతగా విద్యుత్ చార్జీల మోత :ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన ఈ 56 ఏళ్ళలో ఏనాడూ కనీ వినీ ఎరుగని రీతిలో విద్యుత్ చార్జీలను ప్రభుత్వం పెంచేసిందని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ చార్జీలు వ్యవసాయం మీద, పరిశ్రమల మీద, గృహ అవసరాల మీద తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు వారానికి మూడు రోజుల పాటు ఈ ప్రభుత్వం అధికారికంగానే పవర్ హాలిడే ప్రకటించడాన్ని తప్పుపట్టారు. అధికారికంగా నెలకు 12 రోజులు పవర్ హాలిడే అని చెప్పినా అనధికారికంగా 15 రోజులు విద్యుత్ ఉండడంలేదన్నారు. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారానికి 4 రోజులు పవర్ హాలిడే విధించనున్నట్లు ప్రభుత్వం చెప్పడాన్ని కూడా ఆమె ఆక్షేపించారు. పవర్ హాలిడే వల్ల వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని, 1,45,000 కుటీర పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. పరిశ్రమలలో పనిచేసే 25 లక్షల మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తం చేశారు.
విద్యుత్ సంక్షోభం, కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ నిర్ణయాల కారణంగా మన రాష్ట్రంలోని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయని శ్రీమతి విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ లేక ఇబ్బందుల్లో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలకు ఈ ప్రభుత్వం కొంచెమైనా భరోసా ఇచ్చే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చిన్న పరిశ్రమలు తీసుకున్న బ్యాంకు రుణాల వసూలును వాయిదా వేయించాల్సిన బాధ్యత విద్యుత్ ఇవ్వలేని ఈ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వం తీరు కారణంగా మన రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
గ్రామాల్లో రెండు గంటలైనా కరెంటు ఉండడంలేదు :గ్రామాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 12 గంటలు విద్యుత్ కోత విధించినట్లు ప్రభుత్వం చెప్పినా రాత్రిళ్ళు కూడా గంటా రెండు గంటలు కూడా కరెంటు ఉండని దుస్థితి నెలకొందని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఉచిత విద్యుత్‌కు నేటి పాలకులు తూట్లు పొడిచారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. మహానేత వైయస్‌ఆర్ మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తరువాత అతివృష్టి, అనావృష్టి మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు. లైలా, నీలం, జల్ తుపానులు, మొన్నటి అకాల వర్షాల వల్ల సర్వం నష్టపోయి అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు చివరికి కిడ్నీలు అమ్ముకునే దుస్థితి దాపురించిందని విచారం వ్యక్తంచేశారు.
పేదలపై విద్యుత్ బిల్లుల ప్రతాపం :తుపానుల్లో నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకూ ఇవ్వలేదని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. ఒక వైపున పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, సబ్సిడీ విత్తనాలు దొరకడం లేదన్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు కూడా క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల వల్ల 116 శాతం పేద, మధ్య తరగతి ప్రజల మీద పడుతున్నదన్నారు. ఒక్క బల్బు, ఒక్క ఫ్యాన్ ఉన్న ఇళ్ళకు మహానేత వైయస్‌ఆర్ ఉచితంగా విద్యుత్ ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం వారికి కూడా వేలకు వేలు బిల్లులు వేస్తోందన్నారు.
మహానేత వైయస్ ప్రతిరోజు సమీక్షించేవారు :ఇదేమి తీరు అని ప్రశ్నిస్తే గ్యాస్ లేదని, ప్రాజెక్టులలో నీరు లేదని, బొగ్గు లేదు మేమేం చేయాలని ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటున్నదని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నదని, ఉత్పత్తి తగ్గిపోయిందని ఈ ప్రభుత్వానికి తెలియదా? అని ఆమె నిలదీశారు. ప్రాజెక్టుల్లో నీరెంత ఉంది, విద్యుత్ ఎంత ఉందన్నది మహానేత వైయస్ ఉన్నంతకాలమూ ప్రతిరోజూ ఉదయమే సమీక్షించేవారని చెప్పారు. గ్యాస్, బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలనే ముందస్తు ప్రణాళిక ఈ ప్రభుత్వం ఎందుకు వేసుకోలేదని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. గత పది పదిహేనేళ్ళుగా కృష్ణా జలాశయాలు నిండడంలేదని, విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరగని విషయం ఈ ప్రభుత్వానికి గుర్తు లేదా? అని విమర్శించారు. దక్షిణాది పవర్ గ్రిడ్ నుంచి ముందుగానే విద్యుత్‌ను సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఎందుకు కొనుగోలు చేయలేదని నిలదీశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అపరాధం :కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని శాఖల మధ్య సమన్వయం కొరవడిందని, అందుకే ఇలాంటి సమస్యలన్నీ ప్రజలను చుట్టుముడుతున్నాయని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. ఇది కేంద్రం అపరాధమన్నారు. కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన గ్యాస్, విద్యుత్, బొగ్గును సాధించుకోలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన మహా అపరాధమన్నారు. మన రాష్ట్రంలో 2,000 మెగా వాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు ఉన్నాయని, వాటి నుంచి ఒక్క యూనిట్ కూడా మనకు అందడంలేదన్నారు. ఈ ప్రాజెక్టులకు గ్యాస్ తెచ్చుకుని ఉంటే ఇప్పుడు విద్యుత్ కోసం ఏ రాష్ట్రాన్నీ అడగాల్సిన పరిస్థితే ఉండేది కాదన్నారు.
ఒక్క పైసా చార్జి పెంచని వైయస్‌ఆర్: :మహానేత రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు సంవత్సరానికి 15 వందల కోట్ల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ కూడా ఒక్క పైసా చార్జి పెంచలేదన్నారు. ఆర్టీసీ చార్జీలు, మున్సిపల్ పన్నులు పెంచని వైనాన్ని గుర్తుచేశారు. ఒక్క పైసా పెంచకుండా కరెంటును సక్రమంగా ఇచ్చారన్నారు. విద్యుత్ బకాయిలను కూడా ఆయన రద్దు చేశారన్నారు. ఈ ప్రభుత్వం అలా ఎందుకు చేయలేకపోతోందని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. తక్కువ కరెంటు ఇస్తున్న ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు మాత్రం బాగా పెంచేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పరిశ్రమలకు అంతకు ముందున్న కరెంటు బిల్లులో యూనిట్‌కు 70 పైసలు తగ్గించడమే కాకుండా 24 గంటలూ సరఫరా చేస్తామని మహానేత వైయస్ భరోసా ఇచ్చారన్నారు. ఐదు కోట్ల లోపు పెట్టుబడితో పరిశ్రమలు పెడితే వాటికి బ్యాంకుల నుంచి పూర్తిగా రుణాలు ఇప్పిస్తామని ప్రోత్సహించారన్నారు. మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తక్కువైనప్పుడు రూ.15 కు కేవలం 3 రూపాయల 75 పైసలకే వైయస్ సరఫరా చేసిన వైనాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు.
ఉచిత విద్యుత్‌ను చంద్రబాబునాయుడు అప్పట్లో ఎగతాళి చేశారని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పటి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే ఉందని ఆమె అభివర్ణించారు. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరయూ కరెంటు చార్జీలు పెంచారన్నారు. బషీర్‌బాగ్‌లో పోలీసు కాల్పులు జరిపించి రైతులను చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించని చంద్రబాబు కాల్పులు జరిపిన పోలీసులను అభినందించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు తానూ ఉచిత విద్యుత్ ఇస్తానంటూ చెబుతున్నారని, రుణ మాఫీ చేస్తానంటూ కల్లబొల్లి వాగ్దానాలు చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబు లాంటి నీచుడు మరొకరు లేరు :ఆనాడు పల్లెలను చంద్రబాబు శ్మశానాలుగా మార్చారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి లాంటి నీచుడు మరో ముఖ్యమంత్రి లేరని నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్ళ పాలనలో ఒక్కరోజైనా రుణ మాఫీ గురించి ఆలోచన చేశావా చంద్రబాబూ అని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఆరు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అవినీతిపరుడని చంద్రబాబు నాయుడు గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా అని శ్రీమతి విజయమ్మ సవాల్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలపై యూజర్ చార్జీలు వేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. కృష్ణా, గోదావరి నీళ్ళు రాష్ట్రానికి సరిగా రాకపోవడానికి, కర్నాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి, బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర కట్టడానికి చంద్రబాబు కారణం కాదా అన్నారు. అసత్యాలు చెప్పే చంద్రబాబు చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుండవనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 2009 నుంచీ కూడా చంద్రబాబు పార్టీని అధికారంలోకి రానివ్వకుండా బుద్ధి చెబుతూను ఉన్నారన్నారు. ఉప ఎన్నికల్లో టిడిపికి డిపాజిట్లు కూడా దక్కని వైనాన్ని మరిచిపోయారా? అన్నారు.
విద్యుత్ చార్జీలు పెంచినందుకు, విద్యుత్ కోతలు పెంచుతున్నందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనలో పాల్గొన్న అందరికీ శ్రీమతి విజయమ్మ ధన్యవాదాలు తెలిపారు. ధర్నా అనంతరం శ్రీమతి విజయమ్మ విద్యుత్ సమస్యలపై ఎమ్మార్వోకు మెమోరాండం సమర్పించారు.