ధనార్జనే బాబు ధ్యేయం

పాలనలో టీడీపీ పూర్తిగా వైఫల్యం
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు
నయవంచక పాలనపై చీటింగ్ కేసులు
జూన్ 8న పీఎస్ లలో బాబుపై ఫిర్యాదులు
విజయసాయిరెడ్డి ఉన్నత విద్యావంతుడుః బొత్స

హైదరాబాద్ః చంద్రబాబుకు ధనదాహం, సొంత ప్రయోజనాలు తప్ప ప్రజాప్రయోజనాలే పట్టడం లేదని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. పాలనలో టీడీపీ  పూర్తిగా వైఫల్యం చెందిందని బొత్స దుయ్యబట్టారు. అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రం....చంద్రబాబు, ఆయన తాబేదారుల విచ్చలవిడి దోపిడీతో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నవనిర్మాణం ఎక్కడా జరగడం లేదని...ఉన్న నిర్మాణాలే కూలిపోయే పరిస్థితి వస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు బొత్స బదులిచ్చారు. 

బాబుపై చీటింగ్ కేసులు పెడతాం
హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా టీడీపీ అవినీతి పాలనపై విరుచుకుపడ్డారు. నయవంచక పాలన సాగిస్తున్న చంద్రబాబు, ఆయన పార్టీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. జూన్ 2న  పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రజలు, పార్టీశ్రేణుల అభిప్రాయం మేరకు జూన్ 8వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించారు. 8వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి,  పోలీస్ స్టేషన్ లలో చీటింగ్ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సామాన్య కార్యకర్త నుంచి శాసనసభ్యుడి వరకు ప్రతిఒక్కరూ పాల్గొని బాబు తప్పిదాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 

పరనింద,ఆత్మస్తుతి తప్ప ఏమీ జరగలేదు
చంద్రబాబు ఏకార్యక్రమం చేసినా వ్యాపారకోణంలోనే చూస్తున్నారు తప్ప ...ప్రజలకు మేలు చేసే ఆలోచనే చేయడం లేదని బొత్స ఫైరయ్యారు. మహానాడులో పరనింద, ఆత్మస్తుతి తప్ప ఏమీ జరగలేదని అన్నారు. ఎంతసేపు వైయస్ జగన్ ను, పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప...రాష్ట్రాభివృద్ధి గురించి చర్చించిన పాపాన పోలేదన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇచ్చిన హామీలకు దిక్కులేకుండా పోయిందని, విభజన హామీలను అటకెక్కించారని ఫైరయ్యారు. రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప పలానా కార్యక్రమం చేశామని గుండెమీద చేయివేసుకొని చెప్పగలరా బాబు అని నిలదీశారు. 

విజయసాయిరెడ్డి ఉన్నత విద్యావంతుడు
తమ పార్టీ ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం డబ్బున్నవారిని ఎంపిక చేశారని  బొత్స సత్యనారాయణ విమర్శించారు.  కాసులిస్తేనే బాబు సీటు ఇస్తున్నారని ఆయన సొంత పార్టీ నేతలే చెబుతాన్నారని బొత్స  అన్నారు.  వైయస్సార్సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన విజయసాయి రెడ్డి ఉన్నత విద్యావంతుడని బొత్స తెలిపారు. విభజన చట్టంలోని అంశాలను,  పార్టీ తీసుకున్న నిర్ణయాలు, వైయస్ జగన్ ఆలోచనల్ని సాయిరెడ్డి రాజ్యసభలో ప్రతిబింబిస్తారని బొత్స పేర్కొన్నారు. ఇక ఇదే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రాజ్యసభకు ఎంపికకావడం సంతోమని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. పోలవరం, ప్రత్యేకహోదా ముఖ్యమంగా రైల్వే జోన్ విషయంలో సురేష్ ప్రభు సహకారం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. 

ప్రజలు ఆలోచన చేయాలి
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న విధానం చూస్తూంటే అసహ్యమేస్తోందని బొత్స చీధరించుకున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ  సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్న... బాబు నీచ రాజకీయాల గురించి ప్రజలు ఆలోచన చేయాలని బొత్స సూచించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో పట్టుబడి ముద్దాయిగా ఉన్న బాబు...ఏపీలో కూడా అవే రాజకీయాలు కొనసాగించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బాబుకు వ్యాపారం, ధనార్జనే తప్ప ప్రజాస్వామ్య పరిరక్షణ లేదని తేటతెల్లం అయ్యిందన్నారు.  ప్రధాన ప్రతిపక్షంగా  విలువలకు కట్టుబడి తమ బాధ్యతగా....బాబు నయవంచక పాలనపై చట్టరీత్యా చర్యలు తీసుకునేలా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. 


Back to Top