రైల్వే జోన్ సాధ‌న‌కు ఉద్య‌మం

గాజువాక‌:  విశాఖ‌కు ప్రత్యేక రైల్వేజోన్ సాధ‌న కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రత్యక్ష
ఉద్య‌మానికి దిగుతోంది. ఉత్తరాంధ్ర ప్రగతికి దిక్సూచి వంటి రైల్వే జోన్ సాధించాలని
పట్టుదలతో ముందుకు సాగుతోంది.  భావితరాల భ‌విష్య‌త్
కోసం విశాఖ‌కు రైల్వే జోన్ అవ‌స‌ర‌మ‌ని పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్
పేర్కొన్నారు. రైల్వే జోన్ సాధ‌న కోసం ఈ నెల 14 నుంచి అమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టాల‌ని పార్టీ
నిర్ణ‌యించింద‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ సేవాద‌ల్ జిల్లా అధ్య‌క్షుడు ఎస్‌. వాసు 61వ వార్డు చిన‌గంట్యాడ‌లో ఏర్పాటు చేసిన
పార్టీ కార్యాల‌యాన్ని ఆయ‌న ప్రారంభించారు.   ప్ర‌జా
స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
చేప‌డుతున్న పోరాటాలు స్ఫూర్తినిస్తున్నాయ‌న్నారు. మొన్న‌టి వ‌ర‌కు అసెంబ్లీలో
బిజీగా ఉన్న ఆయ‌న అసెంబ్లీ స‌మావేశాల అనంత‌రం విశ్రాంతి లేకుండా తిరుగుతున్నార‌న్నారు.

నిరాహార దీక్ష‌తో ప్ర‌భుత్వాల‌కు క‌నువిప్పు

రైల్వే జోన్ కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన నిరాహార దీక్ష‌తోనైనా
ప్ర‌భుత్వాల‌కు క‌నువిప్పు క‌లుగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
గొల్ల బాబూరావు అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్ర ప్ర‌భుత్వానికి గ‌డ్డుకాలం
ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నార‌న్నారు. రైల్వే జోన్ కోసం అమ‌ర్‌నాథ్
చేప‌ట్ట‌నున్న అమ‌ర‌ణ నిరాహార దీక్ష రాష్ట్రంలో సంచ‌ల‌నం కానుంద‌న్నారు. ప్ర‌జ‌లు
ఆయ‌న‌కు కొండంత అండ‌గా నిల‌వాల‌ని కోరారు. జీవీఎంసీ ఎన్నిక‌ల వేడి మొద‌లైంద‌ని, మేయ‌ర్ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగ‌ర‌డం
ఖాయ‌మ‌న్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కొయ్య ప్ర‌సాద‌రెడ్డి
మాట్లాడుతూ గ‌డిచిన మూడు రైల్వే బ‌డ్జెట్‌ల‌లోను విశాఖ రైల్వే జోన్‌పై ప్ర‌జ‌ల‌ను
మోస‌గించార‌న్నారు. సినిమా టిక్కెట్లు అమ్ముకునే దుస్థితికి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ‌జారార‌న్నారు. రూ. 100 టికెట్‌ను  రూ. 1000కి అమ్ముకుంటూ పేద‌ల‌ను దోచుకుంటున్నార‌న్నారు.

 

Back to Top