మొదలెట్టు... పక్కనెట్టు

* కొనసాగుతున్న రాజధాని శంకుస్థాపనల పర్వం
* మొదట కుటుంబ సభ్యులతో చంద్రబాబు ప్రత్యేక పూజలు
* రెండో సారి ప్రధాని నరేంద్ర మోదీతో..
* ముచ్చటగా మూడోసారి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో  శంకుస్థాపన
* మాస్టర్‌ ప్లాన్‌ లేని భవనాలకు భూమి పూజలు
* వృథా అవుతున్న కోట్లాది రూపాయలు


అమరావతి: నన్ను నమ్మండి..నాకు రాజకీయ అనుభవం ఉందని ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వింతగా ప్రవర్తిస్తున్నారు. ఏ ఒక్క కార్యక్రమం పూర్తి చేయకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా చంద్రబాబు అభివృద్ధి అంతా మొదలెట్టు ..పక్కనెట్టు అన్నట్టుగా ఉంది. బిల్డప్‌ కోసం తాపత్రయపడుతూ..ఎడాపెడా శంకుస్థాపనలంటూ కోట్లాది రూపాయలు వృథా చేస్తున్నారు. ఏ పనైనా హడావుడిగా మొదలు పెట్టడం... కొన్నిరోజులు దానిపై రాజకీయాలు చేయడం జనం మరిచిపోగానే మళ్లీ ఇంకో పనిమొదలు పెట్టడం బాబుకు బాగా అలవాటైంది. అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనల పర్వం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ముచ్చటగా మూడోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణŠ జైట్లీ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట భూమిపూజ పేరిట తొలి శంకుస్థాపన చేశారు. రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మరోసారి శంకుస్థాపన చేస్తున్నారు. రాజధాని శాశ్వత పరిపాలన భవన సముదాయం కోసం ఈ కార్యక్రమం తలపెట్టారు. అయితే ఆ భవనాలు ఎలా ఉండాలనేది ఇంతవరకు స్పష్టత లేకపోవడం విశేషం. మూడు రోజుల క్రితమే భవనాల ఆకృతి రూపకల్పనకు టెండర్లు పిలిచారు. మూడుసార్లు చేపట్టిన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చయింది. కానీ రాజధానికి మాత్రం ఒరిగిందేమీ లేదు. ఆకృతి లేని భవనాలకు శంకుస్థాపన ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పట్టిసీమ విషయంలో కూడా ఇలాగే పదే పదే శంకుస్థాపనలు చేశారు.

మట్టి చదును చేయడమూ నిర్మాణమేనంట
 జైట్లీ చేసే శంకుస్థాపనకు గుంటూరు జిల్లాలోని పలు స్కూళ్ల నుండి బస్సులు పంపించాలని, విద్యార్థులనూ తరలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. నవంబరు ఒకటో తేదీ నుంచే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయనీ ప్రకటించేశారు. ఆకృతే లేకుండా పనులు ఎలా చేపడతారని సీఆర్‌డీఏ అధికారులను వివరణ అడిగితే.. మట్టి చదును చేయడమూ నిర్మాణంలో భాగమేనని చెప్పారు. 2015 జూన్‌ ఆరో తేదీన తాళ్లాయపాలెం పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. అప్పటికి కనీసం ప్లాను కూడా రాలేదు. అదే ఏడాది అక్టోబర్‌ 22న ప్రధాని నరేంద్రమోడీ వచ్చి ఉద్దందరాయునిపాలెంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలూ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసమేనని పేర్కొంది. ఇప్పుడు మరోసారి శంకుస్థాపన రాజధాని పరిపాలన భవనాల సముదాయం అంటోంది. శంకుస్థాపన అనంతరం మట్టి పనులు, నేల చదును చేయడం, రోడ్లు వేయడం వంటి పనులన్నీ చేపడతామని సీఆర్‌డీఏ అధికారులు వివరణ ఇస్తున్నారు. ఈ పనులయ్యే సరికి ప్లాన్‌ వస్తుందని, అప్పుడు దాని ఆధారంగా టెండర్లు పిలిచి పనులు నిర్మాణ పనులు చేపడతామని చెబుతున్నారు. ప్లాన్‌ రావడం దాన్ని ఖరారు చేయడానికి ఒక నెల, అనంతరం టెండర్లు పిలిచి కనీసం మూడు నెలల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ఆమోదించి పనులు చేపట్టేసరికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఇప్పుడీ శంకుస్థాపప అదీ జైట్లీతో చేయించడం వెనుక నిధుల కోరేందుకు, ప్యాకేజీ పేరిట ఇంతవరకు ఆయన ప్రకటించినవే మళ్లీ ప్రకటింపజేసేందుకు. శంకుస్థాపన మూడోసారీ అయిపోయింది కాబట్టి జోరుగా భూములు కేటాయింపులు చేసేందుకేనని అధికారులే విశ్లేషిస్తున్నారు.

భూ కేటాయింపుల కోసమే హడావుడి
ప్రస్తుతం రాజధానిలో సీఆర్‌డీఏకు వచ్చే భూములను ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్నారు. వీఐటీæసంస్థ ఇటీవల రూ.50 కోట్ల చెక్‌ను కూడా అందించింది. దానికి 200 ఎకరాలు అప్పగించాల్సి ఉంది. తొలిదశలో 100 ఎకరాలు ఇచ్చి రెండోదశలో మరో 100 ఎకరాలు ఇవ్వనున్నారు. ఎస్‌ఆర్‌ఎం సంస్థ కూడా డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం మొదలుపెట్టకుండా ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపులు జరిపి వారు పనులు మొదలుపెడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవ్వడంతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరుతో తతంగం మొదలు పెట్టినట్లు తెలిసింది. ప్రభుత్వ కార్యాలయాల పనులు మొదలయ్యాయని చెప్పడం ద్వారా ప్రైవేటు సంస్థలు వాటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు ఎదురవ్వవనే ఉద్దేశంతో శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టినట్లు తెలిసింది.  
జైట్లీ ఆదుకుంటారంట...
రాజధాని శాశ్వత భవనాల శంకస్థాపన కోసమని శుక్రవారం గుంటూరుకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఏపీకి ప్యాకేజీపై బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకుంటామని, రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని ప్రకటించారు. నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన ప్రసంగమంతా మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులను  అంతేతప్ప ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. 

రెండున్నరేళ్లలో రూ. 2లక్షల కోట్లు ఇచ్చారట
2004– 09 వైయస్‌ హయాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 34,910 కోట్లు కేటాయించగా 2009–14 మధ్య రూ. 69298 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కానీ గడిచిన రెండున్నరేళ్ల కాలంలోనే కేంద్రం నుంచి కొత్తగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వానికి రూ. 2లక్షల 3వేల 194 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఏపీ రావాల్సిన దానికంటే ఎక్కువగానే ఇచ్చామని జైట్లీ బీజేపీ కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టపరంగా సమస్యలున్నాయని అందుకే ఇవ్వలేకపోయామన్నారు. అయినాసరే ఆ విధంగా ఏపీకి రావాల్సిన 90:10 ప్రాతిపదికన నిధుల కేటాయింపులు చేస్తున్నామని ప్రకటించారు. దీనిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చామని అవసరమైతే నాబార్డు నుంచి కూడా నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్యాకేజీకి చట్టబద్దత కల్పించే విషయంపై ఆయనెక్కడా స్పందించనేలేదు.

అయితే ఆ నిధులన్నీ ఏమైనట్టు
జైట్లీ ప్రకటించినట్టు ఏపీకి రెండు లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తే ఆ నిధులన్నీ ఏమైనట్లని అక్కడున్న బీజేపీ కార్యకర్తలు కూడా నోరెళ్లబెడుతున్నారు. రాజధాని నిర్మాణం కనీసం పునాది రాళ్లను కూడా దాటలేదని, పోలవరం లాంటి ప్రాజెక్టుల పనులు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండగా ఆ నిధులన్నీ ఏమైనట్టో అర్థంకాని పరిస్థితి. దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు చేయలేదు.., నిరుద్యోగ భతి ఇవ్వలేమని చేతులెత్తేశారు.. రైతులకు కేటాయించాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా మిగుల్చుకున్నారు. అలాంటప్పుడు నిధులన్నీ ఎక్కడ ఖర్చయ్యాయో ఇచ్చిన కేంద్రానికి తీసుకున్న బాబుకు మాత్రమే తెలియాలి. దీనిపై తీవ్ర అయోమయంలో ఉన్న ప్రజల అనుమానాలను నివత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. 

 పాత పాటే పాడిన అరుణ్‌జైట్లీ
అమరావతి శాశ్వత భవనాల శంకుస్థాపనకు శుక్రవారం రాజధానికి విచ్చేసిన అరుణ్‌జైట్లీ అదే పాత పాట పాడి వెళ్లారు. ఇప్పటికే ఏపీ అభివృద్ధికి చాలా ఇచ్చాం.. ఇంకా ఇస్తూనే ఉంటామని చెప్పారుగానీ ఏమిచ్చారో స్పష్టంగా మాత్రం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి విద్యాసంస్థలు, అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాలు నెలకొల్పుతామని ప్రకటించారు. దాదాపు 25 వరకు సంస్థల పేర్లు చదివి వినిపించారు. ఇప్పటికే కొన్నింటి నిర్మాణం జరిగిందని, మరికొన్నింటికి భూ సేకరణ దశలో ఉన్నాయని, ఇంకొన్ని పూర్తికావచ్చాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన బాగుందని, ఇప్పటికే కొన్ని ప్లాన్‌లు చూశానని కితాబిచ్చారు. వెంకయ్యతో తనకు దాదాపు నలభయ్యేళ్ల అనుబంధం ఉందని రాష్ట్రాభివృద్ధికి కష్టపడుతున్నారని అభినందించారు. మోడీ పాలనలో దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Back to Top