ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి

మునగపాక: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. ఇందుకు నిరశనగా 7వ తేదీన నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన యలమంచిలిలో ప్రజా స్వామాన్యి కాపాడాలని కోరుతూ బైక్‌ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపడుతున్నామన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్‌ మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్నారు. దీనికితోడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం విచారకరమన్నారు.గతంలో తెలంగాణా రాష్ట్రంలో టీడీపీకి చెందిన శాసనసభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటే ఆరోపణలు చేసిన చంద్రబాబు నేడు రాష్ట్రంలో చేస్తున్న తీరు అపహాస్యంగా మిగులుతుందన్నారు. దీనికితోడు గవర్నర్‌ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మంత్రి పదవుల ప్రమాణస్వీకారం చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రలోభాలకు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబునాయుడు వ్యవహార శైలిని గమనిస్తున్నారన్నారు. రానున్న ప్రజాక్షేత్రంలో చంద్రబాబుకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.

Back to Top