బీజేపీ..టీడీపీలు ఏపీని ఘోరంగా మోసం చేశాయి కర్నూలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామన్న టీడీపీలు ఆంధ్రప్రదేశ్‌ని ఘోరంగా మోసం చేశాయని విమ‌ర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోంది ఒక్క వైయ‌స్ఆర్‌ సీపీ మాత్రమేనని తెలిపారు. గురువారం గోపాల్‌రెడ్డి క‌ర్నూలులో మీడియాతో మాట్లాడారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వ‌జ‌మెత్తారు. మోదీ పాలనలో ఏటీఎంలు మూతపడితే.. చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో సుమారు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లలో పేదలకు అన్నం దొరకడం లేదు.. ఒకటి ఉంటే మరొకటి ఉండని పరిస్థితి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని అన్నారు.  రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి చేసిన మోసాలకు ప్రజలే బుద్ధి చెబుతారని గోపాల్‌ రెడ్డి హెచ్చ‌రించారు.Back to Top