పోల‌వ‌రం పూర్తి కాకుంటే దుర్భ‌ర‌మే

విజ‌య‌వాడ‌) కృష్ణా, గోదావ‌రి న‌దుల‌పై ఎగువ రాష్ట్రాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఏపీ ప్ర‌భుత్వం నోరు మెద‌ప‌ట్లేద‌ని ప‌లువురు నేత‌లు త‌ప్పుప‌ట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారం ప్రాజెక్టులు చేప‌డుతున్నా రాష్ట్ర‌ప్ర‌భుత్వం మౌనంగా ఉండ‌ట‌మేంట‌ని ధ్వ‌జ‌మెత్తారు. కృష్ణా - గోదావ‌రి న‌దుల‌పై తెలంగాణ నీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంశంపై విజ‌య‌వాడ‌లో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ... పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌క‌పోతే రాష్ట్రం తీవ్ర దుర్భ‌ర ప‌రిస్థితిని ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని  ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రాన్ని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల్సిన ప్ర‌భుత్వం ప‌ట్టిసీమ‌కు అత్యంత ప్రాధాన్య‌మివ్వ‌డం స‌రికాద‌న్నారు. పోల‌వ‌రాన్ని 2018కి పూర్తి చేస్తామ‌న్న‌రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఇప్పుడు  తొలిద‌శ‌ను పూర్తి చేస్తామ‌ని మాట‌మార్చింద‌ని త‌ప్పుప‌ట్టారు. నీటి సంక్షోభంతో రాష్ట్రంలో రాయ‌ల‌సీమ‌తో పాటు కృష్ణా, గోదావరి జిల్లాలు, ఉత్త‌రాంధ్ర విష‌మ ప‌రిస్థితి ఎదుర్కొంటున్నాయ‌న్నారు. గ‌తంలో అల్మ‌ట్టితో రాష్ట్రానికి తీర‌ని అన్యాయం జ‌ర‌గ్గా... ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టుల‌తో ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై టీడీపీ ప్ర‌భుత్వం నోరు మెద‌ప‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకుంటే ప్ర‌స్తుతం అంత‌ర్‌రాష్ట్ర వివాదాలుగా ఉన్న నీటి స‌మ‌స్య భ‌విష్య‌త్‌లో రాష్ట్రంలోని ప్రాంతాల మ‌ధ్య త‌గ‌వుల‌కు దారి తీస్తుంద‌ని హెచ్చ‌రించారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల‌ను ఇత‌ర రాష్ట్రాల‌కు తాక‌ట్టుపెట్టే చ‌ర్య‌లు మంచివి కావ‌న్నారు. ఐక్య‌పోరాటాల‌తో పాటు అవ‌స‌ర‌మైతే సుప్రీం కోర్టుకెళ్లి మ‌న జ‌ల‌వాటాను ద‌క్కించుకోవాల‌న్నారు. 

తాజా వీడియోలు

Back to Top