హైదరాబాద్) మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు హృదయవిదారకంగా ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి, వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతోమాట్లాడారు. 13 రోజుల దీక్ష అనంతరం కిర్లంపూడిలో దీక్ష విరమించారని, కాపు జేఏసీ సభ్యులు, అభిమానులు ఉద్యమంలో పాల్గొన్న అనేకమందితో కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించారిన చెప్పారు. ముద్రగడ ప్రాణాలు ముఖ్యమని, ఆయన సజీవంగా ఉంటేనే ఉద్యమం సజీవంగా ఉంటుందని అందరం కోరుకున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచి కనీసం బయట ఏం జరుగుతుందో పౌరుడిగాతెలుసుకునే అవకాశం లేకుండా చేశారని, పత్రికలు, టీవీలు చూడనీయలేదని ఇది చాలా బాధాకరం అని ఉమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు. ఉద్యమానికి ఏం జరుగుతుందో తెలియనీయకుండా, పౌరుడిగా ప్రాథమిక హక్కును కూడా వినియోగించుకోకుండా చేయటం చాలా తప్పు అని స్పష్టం చేశారు. ముద్రగడ ది మూడున్నర దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అని, అటువంటి కుటుంబం మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.