ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

హైద‌రాబాద్‌: ఇటీవ‌ల నిర్వ‌హించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో 8 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓట్లలెక్కింపు ప్ర‌క్రియ ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. ఈ నెల 9వ తేదీన పోలింగ్‌ జరిగిన మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలతోపాటు ఈ నెల 17వ తేదీన పోలింగ్‌ జరిగిన కర్నూలు, నెల్లూరు, వైయ‌స్ఆర్‌ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మొద‌లైంది. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 102 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. కర్నూలు, నెల్లూరు స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో కేవలం టీడీపీ, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులే పోటీ నెల‌కొంది. వైయ‌స్ఆర్ జిల్లా స్థానిక సంస్థ‌ల వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి, క‌ర్నూలు నుంచి పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గౌరు వెంక‌ట‌రెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి పార్టీ నాయ‌కుడు ఆనం విజ‌య్‌కుమార్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఈ మూడు జిల్లాల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులే అధిక సంఖ్య‌లో గెలుపొందారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ బ‌లం లేక‌పోయినా చంద్ర‌బాబు త‌న అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు త‌న వ‌ద్ద ఉన్న అవినీతి సొమ్మును ఎర‌గా చూపారు. టీడీపీ ఎన్ని ప్ర‌లోభాల‌కు గురి చేసిన స‌భ్యులు ఆత్మ‌ప్ర‌భోదానుసారంగా ఎన్నిక‌ల్లో పాల్గొన్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీదే విజ‌య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఫ‌లితాల‌పై రాష్ట్రంలో ఉత్కంఠ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Back to Top