ప్రజ‌ల జీవితాల‌తో చెలగాటమాడే నేతలను తరిమికొట్టాలి

పశ్చిమగోదావరి: ప్రజల జీవితాలతో చెలగాటమాడే రాయకీయ నేతలను తరితరిమి కొట్టినప్పుడే గ్రామాలను నాశనం చేసే ఫ్యాక్టరీలు రాకుండా ఉంటాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీని జన ఆవాసాల నుంచి తరలించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు చేపడుతున్న దీక్షకు ఎమ్మెల్యే రోజా, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డిలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ రెండు కిలోమీటర్ల దూరానికే హెలికాఫ్టర్‌లో తిరిగే చంద్రబాబుకు పక్కనే ఉన్న తుందు్రరు మహిళల ఆవేదన, కన్నీళ్లు చూసే తీరిక లేదా అని ప్రశ్నించారు. ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ గ్రామాల మధ్య ఏర్పాటు చేయవద్దని ఇక్కడి ప్రాంత వాసులంతా గగ్గోలు పెడుతున్నా చంద్రబాబుకు పట్టడం లేదన్నారు. ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి  తీసుకున్న సూట్‌ కేసులు వారిని కట్టిపడేశాయని విమర్శించారు. అసెంబ్లీలో ఆక్వాఫుడ్‌పై ఎటువంటి సమాధానం చెప్పకుండా చంద్రబాబు సర్కార్‌ తప్పించుకొని తిరుగుతుందని మండిపడ్డారు. ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీతో పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతారని, పంటపొలాలు నాశనం అవుతాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుంటే అభివృద్ధికి అడ్డం అంటూ బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ అభివృద్ధికి ఎప్పుడు అడ్డుకాదని, రైతులు, మా అక్కచెల్లెల్ల జీవితాలు నాశనం చేసే ఫ్యాక్టరీలకు వ్యతిరేకమని ఉద్ఘాటించారు. ఫ్యాక్టరీని సముద్రతీరానికి తరలిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. తుందుర్రు ప్రజల కన్నీళ్లు, ఆవేదన చంద్రబాబుకు తెలిసివచ్చేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న ప్రసాదరాజును ఎమ్మెల్యే రోజా అభినందించారు.

తాజా వీడియోలు

Back to Top