బిల్లుపై చర్చ మొదలైతే విభజనకు ఒప్పుకున్నట్టే

హైదరాబాద్ :

తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైతే విభజనకు అంగీకరించినట్టే అవుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వాదించారు. అందుకే అసెంబ్లీలో చర్చ జరగకుండా అడ్డుకోవాలని ఆయన సూచించారు. చర్చ జరిగి, చివరిలో బిల్లుపై ఓటింగ్ జరగకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు సభను అడ్డుకుంటే చేయగలిగేది ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సచివాలయ సీమాంధ్ర ఫోరం సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ప్రాంత నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మొత్తం 108 మంది సమావేశానికి హాజరయ్యారు.

‌సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యేలందరూ అఫిడవిట్లపై సంతకాలు చేసి రాష్ట్రపతికి అందజేయాలని నెల రోజుల క్రితమే తాము ప్రతిపాదించినా ఎవరూ ముందుకు రావడం లేదని శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వ్యవహరించాలని, సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాకే బిల్లుపై చర్చను అనుమతించడంపై మిగతా పక్షాలన్నీ ఇప్పటికైనా ఆలోచించాలని ఆయన కోరారు.

అసెంబ్లీలో ముందుగా సమైక్య తీర్మానం చేయాల్సిందేనని, ఆ తర్వాతే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కోరింది. సమైక్యాంధ్ర కోసం తీర్మానం పెట్టాలన్న వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నాయకులు మౌనం పాటించారు. ఈ అఖిలపక్షం భేటీలో  వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, గొల్ల బాబూరావు, కొరుముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top