సమైక్యవాదులూ..'శంఖారావా'నికి తరలిరండి

హైదరాబాద్, 19 అక్టోబర్ 2013: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించ‌కూడదన్న డిమాండ్‌తో ఢిల్లీ నాయకులకు వినిపించేలా, విభజనకు లేఖ ఇచ్చిన టిడిపికి కనువిప్పు కలిగేలా సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తామని వైయస్ఆర్ కాంగ్రె‌స్ శాసనసభా‌ పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. ఇది ఒక పార్టీ సమావేశం కాదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ నిర్వహించే సభ కనుక అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న సమైక్యవాదులు కూడా ఈ సభకు తరలిరావాలని శోభా నాగిరెడ్డి
అన్నారు. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని, ఇదే తమ
ఆహ్వానంగా భావించాలని శోభా నాగిరెడ్డి కోరారు. శనివారం మధ్యాహ్నం ఎల్‌బి స్టేడియంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 26న జరిగే ఈ సభలో సమైక్య రాష్ట్రం కోరుకునే వారందరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలనేది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అభిమతం అని శోభా నాగిరెడ్డి తెలిపారు. అందువల్ల ఉద్యోగులు సహా అన్ని వర్గాలవారూ ఈ సభలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సభకు ఎంత మంది హాజరవుతారనేది తాము అంచనాలు వేయడం లేదని, కానీ అనూహ్యమైన రీతిలో జన స్పందన ఉంటుందని శోభా నాగిరెడ్డి పేర్కొన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాల నుంచీ కూడా సమైక్యం కోరుకునే వారు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అన్నారు.

సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు:

సమైక్య శంఖారావం బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చే వారందరికీ పార్టీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నామని శోభా నాగిరెడ్డి చెప్పారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే వారు ఎక్కడికి రావాలి, వాహనాల‌ను ఎక్కడ నిలుపుకోవాలి వంటి సమాచారం జిల్లా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, అక్కడ సంప్రదించాలని కోరారు. సమావేశ స్థలికి వచ్చేటపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాగులు తీసుకురావద్దని ఆమె సూచించారు.

మొన్నటి వరకూ సుమారు 70 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేశారని, జీతాలు రాకున్నా చిత్తశుద్ధితో వారు సమైక్యాంధ్ర కోసం పాటుపడ్డారని శోభా నాగిరెడ్డి అభినందించారు. సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి ఎన్జీవో సోదరుల సహకారం తీసుకుంటామన్నారు. ఒక రాజకీయ పార్టీగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశానికి మద్దతు ఇవ్వాలని శోభా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

సభ నిర్వహణపై చర్చలు :
హైదరాబాద్ నగర సంయుక్త కమిషనర్‌ (ఎస్‌బీ) మల్లారెడ్డి, సెంట్రల్ జో‌న్ డీసీపీ వీబీ కమలాస‌న్‌రెడ్డి శనివారం ఎల్బీ స్టేడియంకు చేరుకొని సభ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. అనంతరం సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేతలకు ప్రాథమికంగా స్టేడియం పరిస్థితిని వివరించారు.

‌ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, తెల్లం బాలరాజు, విశ్వరూప్, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కొడాలి నాని, ఇతర నాయకులు బి.జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, తలశిల రఘురాం, చల్లా మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఆదం విజయకుమార్, అవినాష్‌గౌడ్ తదితరులు ఎల్బీ స్టేడియంను సందర్శించారు.

Back to Top