జనసేన కాదు..అది టీడీపీకి భజన సేన
ఏం అనుభవం ఉందని జనసేన పార్టీ పెట్టావు
– చంద్రబాబుకు సమస్య వచ్చిన ప్రతిసారి పవన్‌ బయటకు వస్తున్నారు
– పవన్‌ మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం లేదు.


పోలవరం: పవన్‌ కళ్యాన్‌ జనసేన పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి కాదని, టీడీపీకి భజన చేసేందుకే అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. పవన్‌ మాట్లాడే మాటలకు ఆయన చేసే పనులకు పొంతన లేదన్నారు. చంద్రబాబు ఏదైనా సమస్యలో ఉన్నారంటే చాలు పవన్‌కు ప్యాకేజీ ఇచ్చి బయటకు తీసుకువస్తున్నారని విమర్శించారు. అందుకే దీన్ని జనసేన అనరని, చంద్రబాబు పార్టీకి భజన సేన అన వచ్చు అని ఎద్దేవా చేశారు. వైజాగ్‌లో పవన్‌ వ్యాఖ్యలపై రోజా స్పందించారు. చంద్రబాబుది తల్లి టీడీపీ అయితే జనసేనది పిల్ల టీడీపీ అని అభివర్ణించారు. ఎప్పుడు చూసినా కూడా తప్పుచేసిన చంద్రబాబును కాపాడుతున్నారే తప్ప..పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు ఎప్పుడు చూడలేదన్నారు. వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడటానికి పవన్‌కు ఏం అర్హత ఉందని ఫైర్‌ అయ్యారు. అనుభవం లేని లోకేష్‌ ఒక ఎమ్మెల్సీ అయి ప్రజల చేత ఎన్నుకోబడకుండా మంత్రి కావడం కరెక్ట్, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమై, ఆయన పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబు వారసత్వంగా, అల్లుడిగా ముఖ్యమంత్రి కావొచ్చా అని ప్రశ్నించారు. అలాంటి వాళ్లకు పవన్‌ కళ్యాణ్‌ భజన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఏం అనుభవం ఉందని పార్టీ పెట్టావు 
రాజకీయాల్లో ఏ అనుభవం ఉందని చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టారని, ఏం అనుభవం ఉందని పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ పెట్టారని రోజా ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంపీగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారని, మహానేత బతికిఉన్నప్పుడే కడప జిల్లా బాధ్యతలు చూశారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ అనుభవంతోనే రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు అవినీతిలో కూరుకుపోతున్నారని మంజునాథ్‌ కమిటీ రిపోర్టు ఇవ్వకముందే రిజర్వేషన్ల అంశం లె రపైకి తెచ్చారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు విశేష స్పందన రావడంతో పవన్‌ను తీసుకొచ్చి ఆరోపణలు చేయిస్తున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును వైయస్‌ఆర్‌సీపీ బృందం సందర్శిస్తుందని, మా న్యూస్‌ కనిపించకూడదని పవన్‌ను పంపించారు. ఒక బోటు బోల్తా పడిన విషయం ఎక్కడో లండన్‌లో ఓ విద్యార్థి తెలిస్తే నాకు తెలిసిందని చెప్పిన పవన్‌కు ఆంధ్రజ్యోతి కార్యాలయం కాలిపోతే అర్ధరాత్రి వెళ్లి చూశారు. ఆడవాళ్లను వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఈనాడులో వార్తలు వచ్చిన పవన్‌ ప్రశ్నించడం లేదు. ఈ పరిణామాలు అన్ని గమనిస్తే పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించడానికి కాదు పార్టీ పెట్టింది. చంద్రబాబుకు భజన చేసేందుకే పార్టీ పెట్టారన్నారు. చంద్రబాబు ఇలాంటి పవన్‌ కళ్యాన్‌లను ఎంతమందిని తీసుకొచ్చిన ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

మీ అన్నను రోడ్డుపై వదిలేశావు
చిరంజీవిని నడిరోడ్డుపై వదలి పవన్‌ సినిమాల్లోకి వెళ్లారని రోజా అన్నారు. మీ అన్న ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారో అని యువజన విభాగం బాధ్యతలు తీసుకున్న పవన్‌ ఆ పార్టీ 18 సీట్లు మాత్రమే గెలవడంతో చిరంజీవిని నడిరోడ్డుపై వదిలి వెళ్లారని తెలిపారు. వినేవాడు వె్రరివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లు పవన్‌ ఫాలో అవడం సరికాదు. ఎన్‌టీఆర్‌ కట్టిన ప్రాజెక్టులను కూడా వైయస్‌ఆర్‌ పూర్తి చేశారు. మూడున్నరేళ్లుగా పోలవరంకు అనుబంధంగా ఉన్న కుడి, ఎడమ కాల్వలను కమీషన్ల కోసం చేపడుతున్నారు. కృష్ణాడెల్టా సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి చేయాలన్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీలను తాకట్టు పెట్టి కేంద్రంపై ఒత్తిడి చేసి కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తెచ్చుకున్నారు. టీడీపీ ఎంపీకి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి పోలవరం పనులు కట్టబెట్టారని విమర్శించారు. 
 
Back to Top