జగన్‌ ఆరోగ్యంపై అధికారులు వివరణ ఇవ్వాలి

హైదరాబాద్, 26 ఆగస్టు 2013:

చంచల్‌గూడ జైలు అధికారుల తీరుపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు, లక్షలాది మందికి ప్రజా ప్రతినిధి అయిన శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి జైల్లో దీక్ష చేస్తుండగా ఆయన ఆరోగ్య పరిస్థితిని బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులకు ఉందన్నారు. వాటిపై దృష్టి పెట్టకపోగా శ్రీ జగన్ దీక్ష చేస్తున్నారన్న నెపంతో మిగిలిన వారితో ములాఖాత్‌లు రద్దు చేయడం దారుణమన్నారు. తన బంధువు సునీల్‌రెడ్డిని కలిసేందుకు చంచల్‌గూడ జైలుకు వచ్చిన ప్రవీణ్‌రెడ్డిని ములాఖాత్‌కు అనుమతించక పోవడంతో వెనుతిరగాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నెల రోజులుగా రాష్ట్ర ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, బాధ్యత గల ప్రజా నాయకుడిగా దాదాపు 30 గంటల నుంచి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరశన దీక్ష చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కాని, జైలు అధికారులు కాని బయటికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని మీడియా ద్వారా ప్రపంచానికి వెల్లడించాల్సిన కనీస బాధ్యత ఉందన్నారు. తమ బంధువు సునీల్‌రెడ్డిని కలవడానికి వచ్చినా కలవనీయకుండా చేయడం దారుణమైన విషయం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాగా, నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శ్రేణులు, అభిమానులు చంచ‌ల్‌గూడకు చేరుకుంటున్నారు. శ్రీ జగన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు మహిళలు మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. సిబిఐ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, ముక్కా రూపానందరెడ్డి సహా పలువురిని పోలీసులు అరె‌స్టు చేశారు. వారితో పాటు మరో 400 మందిని పోలీసులు అరెస్టు చేసి కంచన్బా‌గ్ పోలీసు స్టేష‌న్కు తరలించారు.‌

Back to Top