రైతుల ఆత్మహత్యలకు విరుగుడు ఏంటి?

ఏపీ అసెంబ్లీ: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని,  రైతుల ఆత్మహత్యలకు విరుగుడు ఏంటని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో  916 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆత్మహత్యలపై ప్రభుత్వం అనేక కారణాలు చెబుతుందని మండిపడ్డారు.గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాజమండ్రి సభలో చంద్రబాబు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగుల వైపు చూసి మీకు ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా 80 శాతం ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. రాయలసీమలో వలసలు అధికంగా ఉన్నాయి. సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి అధిక సంఖ్యలో కూలీలు తరలివెళ్లారు. శ్రద్ధ తీసుకొని రైతుల రుణాలు మాఫీ చేస్తారా? లేదా? అని ప్రశ్నించారు. రెయిన్‌గన్లతో 6 లక్షల ఎకరాలు కాపాడామని గవర్నర్‌తో చెప్పించారని, ఇది సాధ్యమా? అని నిలదీశారు.  దాదాపు రూ.8 వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ బాకాయిలు ఉన్నాయని,  వెంటనే చెల్లించాలని పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు.
Back to Top