ముస్లింలపై చంద్రబాబుది కపట ప్రేమ

–బీజేపీ దూరమవుతుందని ముస్లింలకు దగ్గరయ్యేందుకు బాబు ప్రయత్నాలు
– ఎన్నికల్లో ముస్లింలు ఓట్లు వేయలేదని పగబట్టిన చంద్రబాబు
– టీడీపీ కేబినెట్‌లో ముస్లింలకు ఒక్క మంత్రి పదవైనా ఇచ్చారా?
– వైయస్‌ఆర్‌ హయాంలోనే ముస్లింలకు మేలు
– ముస్లింలంతా వైయస్‌ జగన్‌ వెంటే
హైదరాబాద్‌: ఎన్నికలు వస్తున్నాయని ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ చూపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. ఈ నాలుగేళ్ల వ్యవధిలో ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిన ఆయన ఇప్పుడు బీజేపీ దూరమవుతుందని గ్రహించి, ముస్లింలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్తఫా మీడియాతో మాట్లాడారు. ముస్లింలు టీడీపీకి బాసటగా నిలవాల్సిన సమయమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ మోసం చేసిందని ఈ రోజు ముస్లింలు నీకు గుర్తుకు వచ్చారా బాబూ అని నిలదీశారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడేమో ముస్లింలు కావాలని, బీజేపీతో కలిసి ఉన్నప్పుడు జ్ఞాపకం రాలేదని ధ్వజమెత్తారు. ఏం చేశావని నీకు ముస్లింలు అండగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్లలో టీడీపీ కేబినెట్‌లో ఒక్క ముస్లింకైనా మంత్రి పదవి ఇచ్చావా అని నిలదీశారు. మంత్రి పదవులు వస్తాయని వైయస్‌ఆర్‌ సీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే వారిని కూడా చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. లోకేష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారని, ఆ మాత్రం ముస్లింలకు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబుకు కనికరం లేదన్నారు. గుంటూరులో లాల్‌జాన్‌బాషా మరణిస్తే ఆ కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ముస్లింల ద్రోహి అని రాష్ట్రంలోని ముస్లింలంతా చెప్పుకుంటున్నారన్నారు. ముస్లింలకు అన్యాయం జరిగితే ఎక్కడ న్యాయం జరగడం లేదన్నారు. గతంలో ముస్లింలు ఓట్లు వేస్తేనే టీడీపీ గెలిచిందన్నారు. బడ్జెట్‌లో కోట్లు కేటాయిస్తున్నారని, అందులో ఖర్చులు మాత్రం అరకొరనే అన్నారు. మౌజమ్‌లకు వేతనాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. 

వైయస్‌ఆర్‌ ముస్లింలకు దేవుడు..
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. ముస్లింలకు వైయస్‌ఆర్‌ దేవుడని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్లతో ఎంతో మంది ముస్లింలు ఉన్నత ఉద్యోగాలు సాధించారన్నారు. చంద్రబాబుకు ఓట్లు వేయలేదని ముస్లింలపై కక్షగట్టారన్నారు. బీజేపీ దూరం కావడంతో మళ్లీ ముస్లింలను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముస్లింలంతా కూడా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటారని చెప్పారు. రాబోయే కాలంలో ముస్లింలంతా కూడా వైయస్‌ఆర్‌సీపీకే మద్దతిస్తారని చెప్పారు. పార్టీ మారిన చాంద్‌బాషా, జలీల్‌ఖాన్‌లకు మోసం చేసిన చంద్రబాబు నన్ను కూడా మోసం చేస్తారని, అలాంటి వ్యక్తి వద్దకు ఎందుకు వెళ్తానని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే గతంలో చంద్రబాబును కలిశానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని ముస్తఫా స్పష్టం చేశారు. 
 
Back to Top