ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

అనంతసాగరం:

 ప్రజల సమస్యలు పరిష్కారించడంలో అధికారులు శ్ర‌ద్ధ క‌న‌బ‌ర‌చాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన అనంతసాగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలస్థాయి అన్నిశాఖల అధికారులు, ప్రజలతో ప్రత్యేక గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రజలను అధికారులు ఇబ్బందులు పెట్టవద్దని, వారి సమస్యలను పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ పనితీరును ప్రజలు ఎమ్మెల్యేతో ఏకరువు పెట్టారు. మండలంలో అడంగళ్లలో పేర్లు మార్పులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. సర్వేయర్లు ఎప్పుడు వస్తారో, ఎవరికి తెలియదన్నారు.  తహశీల్దారు ఎంసీ కృష్ణమ్మతో ఎమ్మెల్యే వచ్చే నెలలో నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్‌లోగా రెవెన్యూ సమస్యలు లేకుండా చేయాలన్నారు. ఇందుకోసం సమావేశంలో ఆత్మకూరు ఆర్డీఓ బాపిరెడ్డికి సర్వేయర్‌ సమస్యను ఎమ్మెల్యే వివరించారు. స్పందించిన ఆర్డీఓ ఇరువురు సర్వేయర్లను తాత్కాలిక బదిలీపై అనంతసాగరంకు పంపుతానని తెలిపారు. ముగ్గురు సర్వేయర్లతో మండలంలో పేరుకుపోయిన రెవెన్యూ పరమైన సర్వే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే తహశీల్దారుకు ఆదేశించారు. కొమ్మలేరు వాగు అభివృద్దిలో రైతులకు పరిహారంలో జాప్యం జరుగుతుందని మినగల్లు వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు కేతా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సోమశిలలో ఇష్టారాజ్యంగా అనర్హులు బేస్‌మట్టాలు ప్రభుత్వ స్థలాల్లో నిర్వహిస్తున్నారని, రెవెన్యూ వారు పట్టించుకోవడం లేదని వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడు గుండుబోయిన వెంకటరమణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తహశీల్దారు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అన్నారు. మండలంలోని ఇసుకపల్లి గ్రామంలో పట్టాపొలంలో చెక్‌డ్యామ్‌ నిర్మిస్తున్నారని, తహశీల్దారుకు చెప్పిన పట్టించుకోవడం లేదని తెలపగా వెంటనే సంబంధిత ఇరిగేషన్‌ డీఈతో ఫోన్‌ ద్వారా విషయం తెలిపి పనులను వెంటనే నిలిపివేసేలా ఎమ్మెల్యే ఆదేశించారు.   

Back to Top