మోడల్‌ ప్రతిపక్షంగా నిలుస్తాం

హైదరాబాద్, 20 మే 2014:

ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడిని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కలుసుకోవడంపై టీడీపీ నాయకులు, ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 48 శాతం ఓట్లు సాధించిన వైయస్ఆర్‌సీపీ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించి, దేశంలోనే ఒక మోడల్‌ ప్రతిపక్షంగా నిరూపించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడారు.

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి అంటే టీడీపీ నాయకులకు ఎందుకంత వణుకు అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలని టీడీపీ నేతలకు‌ ఆయన హితవు పలికారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకే ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

70 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరోత్సాహంతో ముందుకు వెళుతుందని శ్రీధ‌ర్‌రెడ్డి ధీమాగా చెప్పారు. నరేంద్ర మోడీ, శ్రీ జగన్మోహన్‌రెడ్డి మధ్య జరిగిన ఏకాంత చర్చలు ఈనాడు దినపత్రికకు ఎలా తెలిశాయని ఆయన ప్రశ్నించారు. కోర్టులను కించపరిచేలా ఈనాడు కథనం రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పత్రిక రాతలపై న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌రెడ్డి కోరారు.

టీటీడీని ప్రక్షాళన చేస్తానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పిన రోజునే సభ్య సమాజం తలదించుకునేలా తిరుమలలో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించారని శ్రీధర్‌ కృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు మద్యం సేవించి తిరుమలలో దుకాణదారులపై దాడులు చేసిన విషయంపై ఆయన ఇలా స్పందించారు. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడితే వైయస్ఆర్‌సీపీ తప్పకుండా మద్దతు ఇస్తుందని శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Back to Top