సమైక్య ద్రోహులకు గుణపాఠం చెబుదాం

రాయదుర్గం :

సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ప్రాణాలైనా అర్పిస్తామని, సమైక్య ద్రోహులకు గుణపాఠం చెబుదామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే కాపు ఆధ్వర్యంలో రాయదుర్గంలో ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి వినాయక సర్కిల్ వరకు సుమారు 200 మంది పొదుపు సంఘాల మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈ ర్యాలీ జరిగింది. ‌వినాయక సర్కిల్‌ వద్ద మానవహారం నిర్మించారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమైక్య ద్రోహులకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. 83 రోజులుగా సీమాంధ్ర  ప్రజలు ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి, సీఎంకు చీమకుట్టినట్లయినా లేదని దుయ్యబట్టారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు  ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తారని ప్రశ్నించారు.

సమైక్య శంఖారావాన్ని సక్సెస్ చేయండి:

హైదరాబా‌ద్‌లో ఈ నెల 26న శ్రీ జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు పార్టీలకు అతీతంగా సమైక్యవాదులంతా తరలిరావాలని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని రాజకీయ జేఏసీ శిబిరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం లయన్సు క్లబ్ ఆధ్వర్యంలో ‌నిర్వహించిన రక్త పరీక్షల శిబిరానికి ఆమె హాజరయ్యారు. సమైక్యాంధ్ర కోసం రక్తాన్నైనా చిందిస్తామంటూ ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ నాయకు‌లలో మాత్రం చలనం లేదని దుయ్యబట్టారు. సమైక్యవాదులంతా శంఖారావం సభలో సమైక్య నినాదాన్ని మార్మోగిస్తే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు.

Back to Top