జ‌లీల్‌ఖాన్ దాదాగిరి

- మహిళా కార్పొరేటర్‌పై దౌర్జన్యం 
 విజయవాడ :   ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని విజ‌య‌వాడ న‌గ‌రంలో దాదాగిరి చేస్తున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్‌ జాన్‌ బీపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ దౌర్జన్యానికి దిగారు. శనివారం నగరంలోని నైజాం గేట్‌ సెంటర్‌లో రోడ్ల విస్తరణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ వచ్చారు. ప్రారంభోత్సవ శిలాఫలకం వద్ద తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలతో ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టించారు. దీంతో ప్రొటోకాల్‌ను పట్టించుకోకుండా టీడీపీ నాయకులతో ఎలా కొబ్బరికాయ కొట్టిస్తారని ఎమ్మెల్యేను వైయ‌స్ఆర్‌  సీపీ కార్పొరేటర్‌ జాన్‌బీ ప్రశ్నించారు. ఈ డివిజన్‌లో నువ్వు పని చేయొద్దు అని జలీల్‌ ఖాన్‌ జాన్‌ బీను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఒక డివిజన్‌లో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్‌ను ఎలా పని చేయొద్దని ఆదేశిస్తారని జాన్‌ బీ జలీల్‌ఖాన్‌ను పబ్లిగ్గా నిలదీశారు. దీంతో ఆగ్రహించిన జలీల్‌ ఖాన్‌ జాన్‌ బీపైకి దూసుకొచ్చారు. కాళ్లు పట్టుకుని సీటు తెచ్చుకున్నావ్‌ అని ఎమ్మెల్యే జాన్‌ బీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం మహిళా కార్పొరేటర్‌పై విమర్శలకు దిగారు. 

మహిళలన్న కనీస గౌరవం కూడా లేకుండా మాట్లాడతారా? అంటూ జాన్‌ బీ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ప్రజల కోసం పని చేయొద్దని చెప్పడానికి ఎమ్మెల్యే ఎవరు? అని ప్రశ్నించారు. కార్పొరేటర్‌ రియాక్షన్‌తో అవాక్కైన జలీల్‌ ఖాన్‌ అక్కడి నుంచి జారుకున్నారు. పబ్లిగ్గా మహిళా కార్పొరేటర్‌పై తెలుగు తమ్ముళ్ళు, ఎమ్మెల్యే దౌర్జన్యంపై స్థానికులు నివ్వెరపోయారు. 

Back to Top