చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు విరక్తి


 క‌ర్నూలు జిల్లా:   సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు విరక్తి  పుట్టిందని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం పేర్కొన్నారు. గత ఎన్నికల్లో లేనిపోని హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఈసారి ప్రజలు నమ్మరని అన్నారు. ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని సిద్ధాపురం, గూళ్యం గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  సీఎం   ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిని పూర్తిగా మరిచారన్నారు. వేదావతి నదిపై  ప్రాజెక్టు నిర్మాణానికి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేస్తామని   2016లో  ప్రకటించిన బాబు ఇంతవరకు పైసా మంజూరు చేయలేదన్నారు. ఇప్పటి వరకు సర్వే పనులు కూడా జరగలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నియోజకవర్గంలోని వెయ్యి ఎకరాలకు సాగునీరు, వంద గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి సొంత నిధులతోనే సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.  రైతుల కోసం పోరాటం చేసి హంద్రీనీవా నుంచి కేసీ కెనాల్‌కు  సాగునీరు అందించానన్నారు.  ఉక్కు ఫ్యాక్టరీ కోసం  సీఎం రమేష్‌ కడపలో చేపట్టిన దీక్ష  ఓ డ్రామా అని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందుకు  లేనిపోని దీక్షలు, హామీలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. హంద్రీనీవా కాలువకు తూం ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక టీడీపీ నాయకులు చేపట్టిన దీక్షలు ఒట్టి నాటకమేనని ఆరోపించారు. రైతులపై ప్రేమ ఉంటే గత నాలుగేళ్లుగా తూముల ఏర్పాటు విషయం గుర్తుకు రాలేదా అని   ప్రశ్నించారు. త్వ‌ర‌లోనే రాజన్న రాజ్యం వ‌స్తుంద‌ని, జ‌గ‌న‌న్న ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు.

 

తాజా ఫోటోలు

Back to Top