రాష్ట్ర విభజన వెనుక రాజకీయ కుట్ర

హైదరాబాద్ :

రాష్ట్ర విభజన రాజకీయ కుట్రలో భాగమే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ‌ఆగ్రహం వ్యక్తంచేశారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకువస్తున్న సమయంలో హడావుడిగా విభజన బిల్లు తీసుకు రావాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. విభజన బిల్లుపై మంగళవారం ఆయన అసెంబ్లీలో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2013’పై తమ పార్టీ చర్చలో పాల్గొంటే విభజన బిల్లుకు సహకరించినట్లేనని, అందుకే తాను అభిప్రాయం మాత్రమే చె‌బుతానని అన్నారు.

రాష్ట్ర ప్రజల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించే విభజన బిల్లును వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని బాబూరావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ముందుగా సమైక్య తీర్మానం చేయాలని స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని పలుమార్లు కోరినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర సరిహద్దులు తెలియని వారు రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నట్లు ఈ విభజనకు సహకరిస్తున్న పెద్దలు చాలా మంది ఉన్నారన్నారు. ‘కేంద్రంలో యూపీఏ రెండుసార్లు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ సహకరిస్తే.. ఇప్పుడు వారి గొంతు కోస్తూ, తెలుగుజాతిని నిలువునా నరికేస్తున్నా‌రని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 3ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే అంశంపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి దేశంలోని పలు రాజకీయ పార్టీల నాయకులను కలిసి విజ్ఞప్తి చేసి, మద్దతు కూడగట్టారన్నారు.

రాష్ట్ర విభజనకు రెండవ ఎస్సార్సీ వేయాలన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు‌ మాట మార్చిందని బాబూరావు నిలదీశారు. ఏ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వాదం ఎలా ఉందో.. సమైక్యవాదం అంతే బలంగా ఉందన్నారు. సమైక్యాంధ్ర విషయంలో ప్రజల్లో శ్రీ జగన్ చైతన్యం తీసుకుని వస్తున్నా‌రన్నారు. విభజన బిల్లును ఆపాలంటే ఓటింగ్‌కు పట్టుపడాల్సిందే అని, అలా జరిగితేనే రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి విషయం బోధపడుతుందన్నారు.

Back to Top