ఓటింగ్ విషయంలో కిరణ్‌ ప్రభుత్వం విఫలం

హైదరాబాద్:

సమైక్యాంధ్ర వాదాన్ని అసెంబ్లీలో సమర్థవంతంగా వినిపించింది ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మాత్రమే అని పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సభలో మెజారిటీ ఉన్నప్పటికీ విభజన బిల్లుపై తిరస్కరణ తీర్మానం విషయంలో అసెంబ్లీలో ఓటింగ్‌ కోసం ఒత్తిడి తేవడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ముగిసే వరకూ కూడా సమైక్య తీర్మానం కోసం వైయస్ఆర్‌సీపీ పట్టు వదలకుండా ప్రతి రోజు దీనిపై ఏదో విధంగా పట్టుపడుతూనే ఉందన్నారు. సమావేశాల చివరి ఘట్టంలో స్పీకర్‌ మనోహర్‌ ప్రక్రియను వేగవంతం చేసి మూజువాణి ఓటుతో తిరస్కరణ తీర్మానం నెగ్గిందని ప్రకటించారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారంనాడు శ్రీకాంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి డ్రామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. బిల్లులోని ప్రతి క్లాజుపైనా ఓటింగ్ ఉంటుందని చెప్పిన ‌సీఎం కిరణ్ ఆ విధంగా ఎందుకు చేయలే‌దని ప్రశ్నించారు. సభలో బిల్లుపై సభ్యులందరూ మాట్లాడాల్సి ఉందని, మూడు వారాల గడువు కావాలని కోరిన కిరణ్ ‌దాని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. సభలో ఇంకా 200 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉన్నా సమయం కోరడంలో సీఎం వైఫల్యం చెందలేదా? అని అడిగారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాదే అయితే జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన రోజునే రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించేవారని గడికోట అన్నారు. కిరణ్ చేస్తున్న విభజన కుట్రలకు చంద్రబాబు నాయుడు అడుగడుగునా వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు కొబ్బరికాయల సిద్ధాంతాలతో కోతి కథలు చెబుతున్న చంద్రబాబు అసెంబ్లీలో తన వైఖరి ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని కిరణ్ ‌ద్వారా తీర్మానం కథ నడిపించారన్నారు. కిరణ్, చంద్రబాబులు మ్యాచ్‌ ఫిక్సింగ్ ‌వల్లే బీఏసీ సమావేశాలకు ఒక్క రోజూ హాజరు కాలేదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో మౌనమునిలా వ్యవహరించిన చంద్రబాబు, సభ ముగిసిన తర్వాత మొసలికన్నీరు కార్చడం సిగ్గుచేటు అన్నారు.

రాష్ట్ర సమైక్యత కోసం వైయస్ఆర్‌సీపీ చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్, టీడీపీ గోబెల్సు ప్రచారాన్ని ఎవరూ నమ్మబోరన్నారు. ‘రూల్ 77 కింద మొట్ట మొదటగా నోటీసులు ఇచ్చింది వైయస్ఆర్‌సీపీయే. నెలన్నర తర్వాత సీఎం కిరణ్‌తో పాటు ఇతరులంతా వైయస్ఆర్‌సీపీనే అనుసరించారు. అయితే సభా నాయకుడైనందువల్ల కిరణ్ పేరునే స్పీక‌ర్ ప్రస్తావించార‌’ని గుర్తుచేశారు.

Back to Top