ఈ దుస్థితికి సోనియా, చిరంజీవి, బాబు కారణం

కడప, 14 ఆగస్టు 2013:

ప్రజా కంటక కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తే.. కాపాడిన చరిత్ర చంద్రబాబు, చిరంజీవిలదే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న అన్ని ఉద్యోగ, ఇతర సంఘాలకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితికి సోనియా గాంధీ, చిరంజీవి, చంద్రబాబు నాయుడు అని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన పదవులకు రాజీనామా చేసి సీమాంధ్ర ఉద్యమంలోని ప్రత్యక్షంగా రావాలని వైయస్ఆర్‌ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, కడప నగర మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుండా చంద్రబాబు ముసలికన్నీరు కారుస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. ఈ ప్రజా కంటక ప్రభుత్వం సరిగా పనిచేయలేదు.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉందని అవిశ్వాస తీర్మానం పెడితే.. తాను కూల్చను నిర్మిస్తానంటూ ఆ రోజు చిరంజీవి ముందుకు వచ్చారని శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మరోసారి అవిశ్వాసం పెడితే.. తనపై ఉన్న కేసుల నుంచి తనను రక్షించుకునేందుకు ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబు అన్నారు. ఆహార భద్రత బిల్లు విఫయంలో సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు విప్‌ను ధిక్కరించాకే సీమాంధ్రకు రావాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజాభిప్రాయానికి మద్దతు తెలపాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తన ఇష్టానుసారం రాష్ట్రాన్ని విభజించడం చాలా అన్యాయం అని రవీంద్రనాథ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం కోసం ఎవరూ ప్రాణత్యాగం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌, టిడిపిల కుమ్మక్కు రాజకీయాల కారణంగానే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పా‌టైన ఆంటోని కమిటీకి తెలుగు భాష తెలియదని వారు పేర్కొన్నారు. తెలుగు తెలియని ఆ కమిటీకి విన్నపాలు ఎలా చేయాలని వారు ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కడపలో వారు చేపట్టిన దీక్షకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్, కిరాణా మర్చంట్, రైస్ మిల్లర్ల అసోసియేషన్లు సంఘీభావాన్ని ప్రకటించాయి. కాగా, శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలకు వైద్యులు బుధవారం ఉదయం పరీక్షలు నిర్వహించారు. వారిద్దరి పల్సురేటు తగ్గినట్లు పరీక్షల్లో తేలింది.

తాజా వీడియోలు

Back to Top