ప్రజల సెంటిమెంటుతో కాంగ్రెస్‌ ఆటలు

హైదరాబాద్, 5 ఆగస్టు 2013:

రాష్ట్ర ప్రజల సెంటిమెంటుతో కాంగ్రెస్‌ నాయకులు ఆటలాడుకుంటున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్‌ బొత్స, కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవిల తీరును ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావుతో కలిసి శ్రీకాంత్‌రెడ్డి సోమవారంనాడు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలను రక్షించే బాధ్యత వహించలేని వారు అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు.

మూడు రాష్ట్రాలు ఇచ్చేయండి అని రాజమంత్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మీటింగ్‌ పెట్టి చెప్పడాన్ని శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. కేంద్ర మంత్రి చిరంజీవి తన ఆస్తులన్నీ హైదరాబాద్‌నే ఉన్నాయని కేవలం హైదరాబాద్‌ గురించి మాత్రమే మాట్లాడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నాయకు ఒక్కొక్కరూ ఒక్కొక్క పద్ధతిలో వారికి ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు దేని కోసం పోరాడుతున్నారు.. వారి మనోభావాలు ఏమిటి.. వారు దేని గురించి అడుగుతున్నారు.. అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా కాంగ్రెస్‌ నాయకులు స్వార్థపూరితంగా తలా ఒక విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని గడికోట నిలదీశారు. రాష్ట్ర ప్రజలు ఏమి కోరుతున్నారు.. ఎందుకింత మంది మరణిస్తున్నారు.. సీమాంధ్ర ప్రాంతం ఎందుకు అంతలా అట్టుడికిపోతోంది అ‌నే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గమనించకపోవడం దురదృష్టకరం, సిగ్గుచేటు అని నిప్పులు చెరిగారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యక్తిత్వమేమిటో, మనసేంటో అందరికీ తెలుసని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. చివరిలో ఆయన డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బొత్స ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. పక్కా సమైక్యవాదినని చెప్పిన చిరంజీవి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిలో ఉన్న ఆయనకు కేవలం హైదరాబాద్‌ మాత్రమే కనిపించిందట అన్నారు. మిగతా ప్రాంతం ఆయనకు కనిపించడం లేదట అని విమర్శించారు. మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు గతంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, రాష్ట్రాన్ని విభజిస్తే ఏ విధంగా నష్టపోతుందో గంటలకు గంటలు ప్రధానికి లెక్చర్లిచ్చారని, ఈ రోజు అవి ఆయనకు ఎందుకు గుర్తుకు రాలేదో ఆలోచిస్తే బాధ కలుగుతోందన్నారు. ప్రజల సెంటిమెంటుతో వీళ్ళంతా ఎందుకు ఆడుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు.

అప్పుడే తానేదో ముఖ్యమంత్రి అయిపోయినట్టు, తనకు ప్రజలు పట్టం కట్టేసినట్టు టిఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్‌గా ఉంటానని, అది చేస్తా, ఇది చేస్తానంటూ ఆయన చెప్పడాన్ని తప్పుపట్టారు. సీమాంధ్ర ఉద్యోగులంతా తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని చెప్పిన కేసీఆర్‌ సమైక్యాంధ్ర రాష్ట్రంలో సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన పింఛన్‌దారులున్నారని వారి గురించి ఆలోచించలేదా? అన్నారు. సమైక్య రాష్ట్రంలో దాదాపుగా లక్షా 50 వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రం పేరుతో అప్పు తెచ్చుకున్నారని దాని సంగతేమిటని ప్రశ్నించారు.

ప్రజలను కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు గందరగోళంలో పడేస్తున్నారని నిలదీశారు. పార్టీలో ఒకే విధానం తీసుకుని అన్ని ప్రాంతాల నాయకులూ ఒకే విధంగా మాట్లాడేలా చూడాలన్నారు. ఒక ప్రాంతంలోనే పలు రకాలుగా మాట్లాడి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

విభజన పేరుతో ఏ ఉద్యోగినైనా అవమానిస్తే.. ఇబ్బంది కలిగిస్తే.. తాము ప్రాణాలకైనా తెగించి వారికి రక్షణగా నిలబడతామని శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బెదరింపులకు పాల్పడడం మంచిది కాదని హెచ్చరించారు. అన్ని ప్రాంతాలూ ఒక్కటే అని భావించి ముప్పై ఏళ్ళుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించామని, విభజన పేరుతో ఇప్పుడు వెళ్ళిపొమ్మనడం సమంజసమేనా అని మహిళా ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తంచేస్తున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటి ఉద్యోగులకు తాము అండగా నిలబడతామన్నారు. హైదరాబాద్‌ నుంచి సీమాంధ్రులు వెళ్శిపొమ్మనడానికి కేసీఆర్‌ ఎవరని ఆయన నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తామంతా డిమాండ్‌ చేస్తున్నామన్నారు. స్వార్థం కోసం రాజధానిని అమ్ముకుంటున్నారని, ప్యాకేజ్‌ అంటున్నారని ఆయన విమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top