అపాయింట్‌మెంట్లు ఎందుకు దొరకడం లేదు


– దుగ్గిరాజుపట్నం పోర్ట్‌ ఏమైంది?
– విశాఖ రైల్వే జోన్‌ ఏమైంది?
– రాజధాని కట్టలేక పోయారు..పోలవరం ఏమైంది?
– అమరావతికి రూ.2500 కోట్లు, విజయవాడ డ్రైనేజీకి వెయ్యి కోట్లు కేంద్రం ఇచ్చిందట.
– నాలుగేళ్లలో నాలుగు టెంపరరీ బిల్డింగ్‌లు కట్టారు
– సీఎం చంద్రబాబు పనితీరుపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు

హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో సాధించింది ఏమీ లేదని, సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు కూడా సీఎం చంద్రబాబుకు దొరకడం లేదని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. అసలు మీకేందుకు కేంద్రం అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏడాది తరువాత ప్రధాని అపాయింట్‌మెంట్‌ ముఖ్యమంత్రికి దొరకకపోవడం, కేంద్ర మంత్రి గడ్కారి కోసం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడకు ప్రత్యేక విమానాల్లో వెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నాలుగేళ్లుగా మభ్యపెడుతూ.. నాలుగేళ్లలో నాలుగు టెంపరరీ బిల్డింగ్‌లు కట్టడం తప్ప సాధించింది ఏమీ లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌ దొరికిందని ఊదరగొడుతున్నారని, ఒక ముఖ్యమంత్రికి ఏడాది పాటు ఎందుకు అపాయింట్‌మెంట్‌ దొరకలేదని బుగ్గన ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా తాను రాష్ట్రం కోసం 30 సార్లు ఢిల్లీ వెళ్లానని చెబుతుంటారన్నారు. నాలుగేళ్లలో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఏ మేలు జరిగిందని నిలదీశారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాలుగు టెంపరరీ బిల్డింగులు కట్టించారని, అది కూడా నాలుగు చినుకులు పడితే కారిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని  ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం సాధించలేదన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, వైజాగ్‌ – చెన్నై కారిడార్‌ అన్నారు.  ప్రత్యేక హోదా, దుగ్గిరాజు పట్నం పోర్టు, అమరావతి నిర్మాణం, పోలవరం ఇలా ఏది కూడా సాధించలేకపోయారన్నారు. దుగ్గిరాజుపట్నం పోర్టు అన్నది 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నారన్నారు. 2018లోపే మొదటి ఫేజ్‌ కంప్లింట్‌ కావాల్సి ఉందన్నారు. అయితే ఇప్పుడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి అయోగ్‌పై కొత్త కథ చెబుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల తరువాత సీఎం ఢిల్లీకి వెళ్లి  ప్రధానికి వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. సామాన్య ప్రజలు కలెక్టర్‌ వద్దకు వెళ్లి అర్జీ ఇచ్చినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. 

రాజధాని ఏమైంది? 
అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. జపాన్, మలేసియా, టర్కీ, లండన్, సింగపూర్‌ అంటూ ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇంతవరకు ఏం మేరకు కట్టించారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ టెంపరరీ భవనాల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజధాని కోసం లక్ష ఎకరాల భూమి తీసుకొని ఏం చేస్తారని నిలదీశారు. త్వరలోనే చంద్రబాబు మోసాలన్నీ కూడా బయటపడుతాయన్నారు. ఐదు వేల ఎకరాలు రాజధానికి సరిపోతాయని మేమంటే..వీరికి రాజధాని నిర్మించడం ఇష్టం లేదని చంద్రబాబు నిందలు వేశారన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు రాజధానికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి బిల్డింగ్‌ ప్లాన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. 

పోలవరంపై కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై కట్టు కథలు అల్లుతుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కనీసం పోలవరం నిర్మిస్తే అర్ధరాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అంచనాలు, విధి విధానాలు అంటూ కాలయాపన చేస్తుందని  విమర్శించారు. పోలవరం అన్నది రెండు, మూడు రాష్ట్రాలకు సంబంధించిందన్నారు. ఇలాంటి ప్రాజెక్టు కేంద్రం కడితే ఉపయోగకరంగా ఉండేదన్నారు. అలాంటి ప్రాజెక్టును మేం కడుతామని చంద్రబాబు తీసుకొని మళ్లీ ఈ రోజు పోలవరాన్ని కేంద్రానికి ఇస్తామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును తీసుకొని ఇంతవరకు ఏం చేశారన్నారు. తెలుగు జాతికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కారి కోసం ఆయన సొంతూరుకు వెళ్లడం, తీరా ఆయన్ను కలిసేందుకు వీలు పడక విమానంలో తిరిగి రావడం ఏంటన్నారు. ఆయన్ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలి కానీ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి  వెళ్లడం, తీరా కలువకుండా వెనక్కి రావడం ఏంటని ప్రశ్నించారు. అసలు మీకు కేంద్రం నుంచి అపాయింట్‌మెంట్లు దొరకడం లేదని ప్రశ్నించారు.

కేంద్రం నిధులకే లెక్కలు లేవు
కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి రూ.2500 కోట్లు, విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ. వెయ్యి కోట్లు ఇచ్చిందని చెబుతుంటే ఈ నిధులకు లెక్కలు లేవని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. దుగ్గిరాజు పట్నం పోర్టును ఎందుకు విస్మరించారని ఆయన ప్రశ్నించారు. కాగ్‌ రిపోర్టు ప్రకారం 24 వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉండేదని, రూ.14 వేల కోట్లతో రూ.7 వేల కోట్లు మాత్రమే లోటు బడ్జెట్‌ ఉందని కేంద్రం చెబుతుందన్నారు. అయితే మళ్లీ చంద్రబాబు రూ.16 వేల కోట్లు లోటు ఉందని లేఖలు రాస్తున్నారన్నారు. ఇన్ని సార్లు మీరు ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏంటని, కేంద్రంలో ఉన్న మీ మంత్రులు ఏం చేస్తున్నారని బుగ్గన ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.

 

 

తాజా వీడియోలు

Back to Top