'అన్నదాతల పాలిట శత్రువు కిరణ్‌ ప్రభుత్వం'

హైదరాబాద్‌, 17 జూన్‌ 2013:

కిరణ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్నదాతల పాలిట శత్రువులా మారిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలతో కలిసి శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.

ఎరువులు 200 శాతం, విత్తనాలు 80 శాతం పెంచిన ఈ ప్రభుత్వం రైతన్నను నిలువునా ముంచేస్తోందని భూమన దుయ్యబట్టారు. ఈ అంశంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రైతులకు దక్కాల్సిన కనీస మద్దతు ధర మాత్రం కేవలం 15 శాతం మాత్రమే పెరిగిందని భూమన తెలిపారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు వారిని శత్రువులుగా చూస్తోందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక చర్యలను గమనిస్తున్న ప్రజలు కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని భూమన విమర్శించారు.

వర్షాకాలం ప్రారంభమైనా విత్తనాలు అందకపోవడంతో రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షంలో తడుస్తూ పెద్ద ఎత్తున క్యూలో నిలబడి ఉంటున్నా అరకొర విత్తనాలే అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కావాల్సినన్ని విత్తనాలు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎరువుల డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి సరిపడినన్ని అన్నదాతలకు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుకు లాభాలు దక్కేలా కనీస మద్దతు ధర నిర్ణయించి పంటలను కొనుగోలు చేయాలని కోరారు.

Back to Top