చంద్రబాబు కుట్రలు ఏమాత్రం సాగనివ్వం

హైదరాబాద్ :

చంద్రబాబు నాయుడి కుట్రలు ఏమాత్రమూ ఫలించబోవని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రతిపక్షాన్ని బలహీనపరచాలని టీడీపీ అధ్యక్షుడు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ఇక కొనసాగనివ్వబోమని వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడిపోతున్నారంటూ వచ్చిన కథనాలను రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి  ఖండించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఇకపై రోజు రోజుకూ బలహీనపడేది టీడీపీయే అని అన్నారు. టీడీపీ ప్రలోభాలకు లొంగి ఇకరిద్దరు పార్టీ మారినా వైయస్ఆర్‌సీపీ బలహీనపడే ప్రసక్తే లేదని వారు ధీమాగా చెప్పారు.

చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ముందు నెరవేర్చాలని మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రజలకు భరోసా కల్పించేలా వ్యవహరించాలే కానీ, ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి వైయస్ఆర్‌సీపీ నేతలను తన వైపు తిప్పుకోవటం ఎంతవరకూ సమంజమని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తుతున్న ప్రజా సమస్యలను అస్సలు పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు వైయస్ఆర్‌సీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించేలా మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. ఆరు నెలల్లో టీడీపీ వాళ్ళే ఇతర పార్టీల వైపు చూడాల్సి వస్తుందన్నారు. ఒకప్పుడు మనం ఎక్కడకు పోతున్నామని ప్రశ్నించిన చంద్రబాబే... ఇప్పుడు  ఎందుకింత దిగజారి వ్యవహరిస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు పులితోలు కప్పుకున్న నక్క అని, మూడు నెలల్లో ఆయన బండారం బయటపడుతుందని అన్నారు.

బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైయస్ఆర్‌సీపీ నిలదీస్తుందనే భయంతో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని చంద్రబాబు తపన పడుతున్నారని మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకూ తాము పోరాడుతూనే ఉంటామన్నారు. శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల తరపున పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నేతలెవరూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీని వీడ‌బోరన్నారు.

Back to Top