ఎమ్మెల్యేలను కొనడమేనా బాబు నీ నీతి

పీలేరు: తాను నిజాయితీ పరున్నని, నిప్పునంటూ పదేపదే ప్రగల్బాలు పలికే సీఎం చంద్రబాబు ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారితో రాజీనామా చేయించకుండానే మంత్రులుగా ఎలా ప్రమాణం చేయిస్తారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. వైయస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దోపిడీకి టీడీపీ ప్రభుత్వం కేంద్రబిందువుగా మారిందన్నారు. రాజధాని నిర్మా ణం పేరిట కోట్ల రూపాయలు దండుకుంటూ ఆ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనడమేనా చంద్రబాబు నీతి అంటూ ప్రశ్నించారు. తాను దేశ రాజకీయాల్లో సీనియర్‌ని అని పదే పదే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తమ పార్టీ శాసనసభ్యులను మంత్రి మండలిలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

 సీఎం తన కుమారుడు లోకేష్‌ని మంత్రిని చేయడం కోసమే మంత్రివర్గ విస్తరణ అంటూ నాటకాలు ఆడారని విమర్శించారు. మంత్రి మండలిలో సుమారు 16 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలు, ఎస్టీలకు మంత్రిమండలి విస్తరణలో అవకాశం కల్పించకపోవడం ద్వారా చంద్రబాబు నిజ స్వరూపం బహిర్గతం అయిందన్నారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. ఎంపీ మిథున్‌ రెడ్డి వెంట పలువురు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Back to Top