బూటకపు హామీలిచ్చి మభ్యపెట్టాలనుకునే నేతలు ఎప్పటికైనా చరిత్రహీనులే..

నీలి మేఘాలు చల్లబడ్డా..
చంద్రబాబు పాలనపై జనాగ్రహం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. వర్షపు జల్లుల్లో
తడిసిపోతూ కష్టాలు చెప్పుకొనేందుకు తరలి వస్తున్న జనమే ఇందుకు సాక్ష్యం.
ముమ్మిడివరంలో మొదలైన ఈ రోజు పాదయాత్ర వృద్ధగౌతమి వద్ద.. రాఘ వేంద్రవారధి మీదుగా
సాగింది. పాదయాత్ర మొదలైన కాసేపటికే వర్షం జల్లు పడింది. నాతో పాటు అంతా
తడిసిపోయాం. ఆశ్చర్యమేంటంటే.. ఆ పరిస్థితుల్లోనూ ప్రజావెల్లువ ఏమాత్రం తగ్గలేదు.
హారతులతో వచ్చే అక్కచెల్లెమ్మలు, కేరింతలు కొట్టే యువత.. ఆఖరుకు
బాధలు చెప్పుకొనేందుకు వృద్ధ దంపతులు కూడా తడిసిపోతూ రోడ్డుపై బారులుతీరారు. వర్షం
కన్నా ఆ జనం నమ్మకం.. అభిమానమే నన్ను మరింతగా తడిపేసిందా.. అనిపించింది. వాళ్ల
ఆదరణకు సదా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. 

 వైద్య రంగానికే వన్నె తెచ్చిన, రాజకీయరంగంలో
మేరునగధీరునిగా ఎదిగిన భారతరత్న డాక్టర్‌ బీసీ రాయ్‌ జయంతిని జాతీయ వైద్యుల
దినోత్సవంగా జరుపుకోవడం గర్వించదగ్గ విషయం. ఆయనలానే వైద్యునిగా జీవితాన్ని
ఆరంభించి.. ప్రజా నాయకునిగా ఎదిగి.. కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన
నాన్నగారిని స్మరించుకున్నాను. అటువంటి ఈ రోజు నాన్నగారితో అనుబంధాన్ని
గుర్తుచేసుకుంటూ కొందరు, దేశానికే
ఆదర్శప్రాయమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టిన నాన్నగారి సేవలను స్మరించుకుంటూ
మరికొందరు.. డాక్టర్స్‌ డే సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలపడం మంచి
అనుభూతినిచ్చింది.  

‘తన కోసం తపించేవాడు
సామాన్యుడు.. పరుల కోసం పరితపించేవాడు మహనీయుడు’అంటారు. అట్టి మహనీయులు
ప్రజలకు ఎప్పటికీ చిరస్మరణీయులే. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, కోనసీమ ముఖచిత్రాన్ని
మార్చిన కాటన్‌దొరను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. వృద్ధగౌతమిపై వంతెన
నిర్మించడం ద్వారా బాహ్య ప్రపంచంతో ఐపోలవరాన్ని అనుసంధానించాలని అహర్నిశలూ తపించిన
కలెక్టర్‌ రాఘవేంద్రరావు పేరును ఆ వారధికి పెట్టుకుని గౌరవించారు. నాడు ప్రజలు, అధికారులు, ప్రభుత్వం.. పరస్పర
సహకారంతో అనతికాలంలోనే వృద్ధగౌతమిపై వారధిని నిర్మించుకుని చరిత్రకెక్కితే.. నేడు
నాన్నగారికి పేరొస్తుందన్న సంకుచితత్వంతో అప్పట్లోనే 30 శాతం పూర్తయిన జీమూలపొలం – గొల్లగరువు వారధిని పూర్తి
చేయకుండా విస్మరించిన నేటి పాలకులు చరిత్రహీనులయ్యారు. 

గుజరాత్‌
స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ డ్రిల్లింగ్‌ పనులతో నష్టపోయిన బాధిత
మత్స్యకారులు.. తాము నెలల తరబడి పోరాడి సాధించుకున్న నష్టపరిహారం ఈ ప్రభుత్వం
వచ్చిన వెంటనే ఆగిపోయిందని, ఈ
పాలకుల లాలూచీ రాజకీయాలే దీనికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ
నేతలు తమ స్వార్థం కోసం వేలాది మత్స్యకార కుటుంబాల ప్రయోజనాలను ఆయిల్‌ కంపెనీ
యాజమాన్యాలకు తాకట్టు పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారా అగ్నికుల క్షత్రియులు. 

రొయ్యల
ఎగుమతిదారులందరూ సిండికేట్‌గా మారి.. పంటచేతికొచ్చే సమయానికి రేట్లు తగ్గించేసి తమ
నోట్లో మట్టికొడుతున్నారంటూ మండిపడ్డారు.. మధ్యాహ్నం కలిసిన ఆక్వా రైతులు.
సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవడానికి యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తానని నేను హామీ
ఇవ్వగానే.. నాలుగేళ్లుగా పట్టించుకోని బాబుగారు ఇప్పటి నుంచే రూ.2కే యూనిట్‌ విద్యుత్‌
ఇస్తానని ప్రకటించాడు. కానీ ఇప్పటికీ పాతరేటు మీదే బిల్లులు వస్తున్నాయని వాపోయారు
ఆక్వా రైతులు. ఇది చాలదన్నట్టు.. బ్యాక్‌ బిల్లింగ్‌ అని, అడిషనల్‌ డిమాండ్‌
చార్జీలని.. దొడ్డిదారిన అధిక బిల్లులు వడ్డిస్తూ నడ్డి విరుస్తున్నారంటూ
మండిపడ్డారు. రొయ్యల ధర పడిపోయిందని లబోదిబోమంటూ వేడుకుంటే.. అదనంగా రూ.30 ధర పెంచాలని బాబుగారు
ఇచ్చిన ఆదేశాలు బేఖాతర్‌ అయ్యాయని బాధపడ్డారు. చిత్తశుద్ధిలేని ఆదేశాలు అమలెలా
అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చాలని కాకుండా..
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో బూటకపు హామీలిచ్చి మభ్యపెట్టాలనుకునే
నేతలు ఎప్పటికైనా చరిత్రహీనులే.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మత్స్యకార పిల్లలకు
ప్రత్యేక రెసిడెన్షియల్‌ స్కూళ్లు, మత్స్యకారులకు సబ్సిడీ
ద్వారా సంస్థాగత రుణాలు, 50 శాతం సబ్సిడీపై డీజిల్, తీరప్రాంత భూముల కేటాయింపు, మత్స్యకారులను ఎస్టీలలో
చేరుస్తామని, కేజీ
నుంచి పీజీ వరకూ ఉచిత విద్యనందిస్తామని.. ఇలా మీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు
గుప్పించారు. ఇంకొద్ది నెలల్లో మీ పదవీకాలం పూర్తవబోతోంది. ఇప్పటికి కనీసం ఒక్క
హామీనైనా నెరవేర్చారా? అవేవీ
నెరవేర్చకపోగా.. ఆయిల్‌ కంపెనీల ద్వారా మత్స్యకార కుటుంబాలకు అందాల్సిన
ప్రయోజనాలను సైతం మీ స్వార్థం కోసం తాకట్టు పెట్టడం ధర్మమేనా?
   

-వైయస్‌ జగన్‌ 

Back to Top