మిర్యాలగూడలో నేటి బహిరంగ సభ రద్దు

మిర్యాలగూడ (నల్గొండ జిల్లా), 16 ఫిబ్రవరి 2013: నల్గొండ జిల్లాలో భారీ వర్షం కారణంగా శ్రీమతి షర్మిల నిర్వహించాల్సిన బహిరంగ సభను కార్యక్రమాల అమలు కమిటీ రద్దుచేసింది. శ్రీమతి పాదయాత్ర నేడు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మూడు కిలోమీటర్లు కొనసాగిన అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రవేశించాల్సి ఉంది. శ్రీమతి పాదయాత్రను ఆరు కిలోమీటర్లకు కుదించారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను శ్రీమతి షర్మిల శనివారంనాడు 14.6 కిలో మీటర్లు కొనసాగించాల్సి ఉంది. ఆమె నేటి పాదయాత్రను ఆరు కిలోమీటర్లకే పరిమితం చేశారు.

శుక్రవారం అర్ధరాత్రి నుంచి నల్గొండ జిల్లాలో అకాలంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మిర్యాలగూడ పరిధిలో భారీ వర్షం కారణంగా రైల్వేట్రాక్‌పై నీరు నిలిచిపోయింది. సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతి‌న్నది. నకిరేకల్ మార్కె‌ట్‌లో 6 వేల క్వింటాళ్ల పత్తి తడిసిపోయింది.

కాగా, ఒక వైపున భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ శ్రీమతి షర్మిల శుక్రవారం రాత్రి బస చేసిన ముకుందాపురం ప్రాంతానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. శ్రీమతి షర్మిల అడుగులో అడుగు వేసి నడవాలని వారంతా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. సమస్యలు జననేత జతనన్న చెల్లెలు శ్రీమతి షర్మిలకు చెప్పుకుని ఊరట చెందుదామని పలువురు స్థానికులు కూడా ఆమె పాదయాత్ర కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారీ వర్షానికి ముకుందాపురం రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. బురద పేరుకుపోయింది. అయినా జనం ఏమీ లెక్కచేయకుండా వచ్చారు. వర్షం కారణంగా శ్రీమతి షర్మిల పాదయాత్ర అలస్యం అవుతోందని, మిర్యాలగూడ బహిరంగ సభ రద్దు అయిందని తెలియడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.
Back to Top