ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు

తెనాలి :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం ఆ వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని వైయస్సార్‌ సీపీ మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షుడు షేక్‌ మహబూబ్‌ బాషా (దుబాయ్‌బాబు) విమర్శించారు. స్థానిక బాలాజీరావుపేటలోని పార్టీ మైనారిటీ విభాగం కార్యాలయంలో సోమవారం ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. దుబాయ్‌ బాబు మాట్లాడుతూ ..రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక ముస్లిం మంత్రివర్గంలో లేకుండా పాలన సాగిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆక్షేపించారు. దీని ద్వారా చంద్రబాబు మైనారిటీల వ్యతిరేకిగా రుజువు చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో 10 శాతంపైగా ఉన్న ముస్లిం మైనారిటీలకు టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి గౌరవం లేదన్నారు. సమావేశంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్‌ అన్సారీ, ఎండీ సాదిక్, షేక్‌ ఖదీర్, ఎంపీటీసీ బాషా తదితరులు పాల్గొన్నారు.

Back to Top