జగన్‌ను విమర్శించే హక్కు మంత్రులకు లేదు

కొత్తవలస: నంద్యాల బహిరంగసభలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ‍ప్రసంగంపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వైయస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నాయుడుబాబు, మండల పార్టీ కన్వీనర్‌ మేళాస్త్రి అప్పారావు, మండల పార్టీ నాయకులు గొరపల్లి జయప్రకాష్‌(శివ) అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య నుంచి శివారెడ్డి హత్య వరకు అన్నింటిలోనూ టీడీపీకి చెందిన నాయకులే ముద్దాయిలన్నారు. సొంత పార్టీలో ఉన్న పరిటాల రవి, వంగవీటి రాధాలను హత్య చేసింది టీడీపీ నాయకులేనని బహిరంగంగా ప్రకటనలు చేసినా పట్టించుకోలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తుంటే తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన చందంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చనందుకు ఆయన్ని ఏమి చేయాలని ప్రజలను ప్రశ్నిస్తే, వారి నుంచి వచ్చిన మాటలకు జగనన్నకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనేత సందించిన బాణాలకు తట్టుకోలేక అంతుచూస్తానని బెదిరించిన మంత్రులు బొండా ఉమ, కింజరాపు అచ్చెన్నాయుడులపై ఏ కేసులు పెట్టారని ‍ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతే గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో అధికార పార్టీ కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతుందన్నారు. అధికార పార్టీ ఎన్ని చేసినా నంద్యాలలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. నంద్యాల బహిరంగసభకు హాజరైన జన సమూహాన్ని చూసి ఓర్వలేక అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, అలాంటి చట్టాన్ని అధికారం అడ్డుపెట్టుకుని ప్రతిపక్షనేతలు, నాయకులను అల్లరి పెట్టాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వేపాడ మండల పార్టీ కన్వీనర్‌ మెరపల సత్యన్నారాయణ, పార్టీ నాయకులు పీఎల్‌ఎన్‌ రావు, జామి ఈశ్వరరావు, విరోతి కొండలరావు, లెంక వరహాలు, పీఎస్‌ఎన్‌ పాత్రుడు, పెదిరెడ్ల సూరిబాబు, డి.రవికుమార్, గొంప దేముడునాయుడు, ఎల్‌.కోట మండల నాయకులు తూర్పాటి అప్పలరాజు, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top