రాష్ట్ర పరిస్థితులపై మంత్రుల కమిటి: ప్రధాని

న్యూఢిల్లీ, 27 ఆగస్టు 2013:

విభజన ప్రకటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన పరిస్థితులపై మంత్రుల బృందంతో కమిటీని ఏర్పాటు చేస్తామని శ్రీమతి వైయస్‌ విజయమ్మ బృందానికి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్ర సమస్యలకు మంత్రుల కమిటీ పరిష్కారం చూపిస్తుందని ఆయన చెప్పారు. సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని డిమాండ్‌ చేస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు మంగళవారం నాడు ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ కలుసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న విభజన నిర్ణయం తర్వాత రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై శ్రీమతి ‌విజయమ్మ బృందం ప్రధానికి మెమొరాండం సమర్పించింది. ప్రధానిని కలిసిన అనంతరం శ్రీమతి విజయమ్మ, మేకపాటి, మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పార్టీ బృందంతో ప్రధాని మాట్లాడుతూ.. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని తమతో ప్రధాని అన్నారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. వైయస్ఆర్ ఉండి ఉంటే ఈ పరిస్థితులను ‌ఆయనే చక్కదిద్ది ఉండేవారని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని శ్రీమతి విజయమ్మ అన్నారు. న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని మన్మోహన్ సింగ్ను కోరామని‌ శ్రీమతి విజయమ్మ తెలిపారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రపతిని కలిసి కూడా ఇదే విషయం చెబుతామన్నారు. మంత్రుల కమిటీ వేస్తామని ‌ప్రధాని  డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.

దశాబ్దాలుగా హైదరాబాద్‌ తమ రాజధాని అనుకుంటున్న సీమాంధ్రుల పరిస్థితి ఇప్పుడేం కావాలని ప్రధానికి చెప్పినట్లు శ్రీమతి విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అనాలోచిన నిర్ణయంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయం తరువాత రాష్ట్రం అగ్నిగుండంలా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. 2001లో రెండవ ఎస్సార్సీ అని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ 2013లో ఏకంగా విభజించిందని అన్నారు. ఏ విషయాన్నీ చర్చించకుండా విభజన నిర్ణయం కాంగ్రెస్ ఎలా తీసుకుంటుందని‌ ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై అభ్యంతరాలను ప్రధానికి వివరించామని శ్రీమతి విజయమ్మ తెలిపారు.

గడచిన 57 ఏళ్లుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని ఒక్క నిర్ణయంతో విభజన దిశగా నెడుతున్నారని ప్రధానికి ఇచ్చిన మూడు పేజీల లేఖలో పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నో జల వివాదాలున్నాయని, విభజించాక ఇంకెలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సమన్యాయం చేయాలని లేదంటే విభజన నిలిపివేయాలని ప్రధానిని శ్రీమతి విజయమ్మ బృందం కోరింది. సమన్యాయం చేయకపోతే విభజన చేసే హక్కు తీసుకోవడం తప్పు అని ప్రధానికి చెప్పామని శ్రీమతి విజయమ్మ తెలిపారు. మహానేత వైయస్‌ మరణం తరువాత రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో చూడమని ప్రధానిని కోరామన్నారు. హైదరాబాద్, నీటి వనరులు, ఉద్యోగాలు, రెవెన్యూ లాంటి అంశాల గురించి ఆయనకు వివరించామన్నారు. ఈ సమస్యలన్నింటినీ ముందే చూసుకుని ఉంటే బాగుండేదని చెప్పామన్నారు.

మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని వద్దకు వెళ్లిన శ్రీమతి విజయమ్మ బృందంలో పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, గొల్ల బాబూరావు తదితరులు ఉన్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా పార్టీ ప్రతినిధి బృందం కలవనుంది.

తాజా ఫోటోలు

Back to Top