బాబు బాటలోనే మంత్రులు

  • అనంతపురం జిల్లా ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
  • ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసిన మంత్రి సునీత 
  • దేవినేని ఉమా నీవు మంత్రివా? మానసిక రోగివా?
  • దమ్ముంటే పోలవరంపై వైయస్‌ జగన్‌ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు బాటలోనే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బేరసారాలకు దిగుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని పద్మ విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌పై వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కల్లు తాగిన కోతిలా ఎగురుతున్నారని ఆమె ఫైర్‌ అయ్యారు. బుధవారం వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఎన్నికను టీడీపీ అపహాస్యం చేస్తుందని ధ్వజమెత్తారు. కింది స్థాయి మొదలు పై స్థాయి ఎన్నిక వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులను కైవసం చేసుకోవడం టీడీపీకి సంప్రదాయంగా మారిందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. 2014 ఎన్నికల్లో కనగానపల్లి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఉండగా టీడీపీ ప్రలోభాలకు గురి చేసి మండల పరిషత్‌ అధ్యక్ష పదవి లాక్కుకున్నారన్నారు. అయితే ఇటీవల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఇద్దరూ కూడా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారని తెలిపారు. ఇప్పుడు కూడా మండలంలో మెజారిటీ స్థానాలు  వైయస్‌ఆర్‌సీపీకే ఉన్నాయన్నారు. కేవలం మండల పరిషత్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి పరిటాల సునీత రంగంలోకి దిగడం సిగ్గు చేటన్నారు. మంత్రి సమక్షంలో ఎంపీటీసీ సభ్యులపై దాడికి పాల్పడి, వారికి ఇష్టం లేకపోయిన బలవంతంగా చేయ్యి ఎత్తించి, వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు అంగీకరించకపోయిన ఏకపక్షంగా ఎన్నిక పూర్తి చేసుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు సమంజసం కాదన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల మన్ననలతో పదవులు పొందాలి కానీ..ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులు పొందడం గొప్పకాదన్నారు. రెండున్నరేళ్లలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా కేవలం ప్రలోభాల బాటలో పదవులు పొందడం సరికాదన్నారు.

ఉమా నోరు అదుపులో పెట్టుకో..
మంత్రి దేవినేని ఉమ పై వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ’మీ ఇంటి పేరు దేవినేని కాదు అవినీతి అని ఎద్దేవా చేశారు. మంత్రి పదవిలో ఉండి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  మంత్రి సీట్లో కూర్చోని మానసిక రోగిలా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పోలవరంపై వైయస్‌ జగన్‌ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ అని హితవు పలికారు. కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే పోలవరం అంచనాలను అమాంతంగా పెంచారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. 

పోలవరం మహానేత డ్రీమ్‌ ప్రాజెక్ట్‌
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి పోలవరం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. నాడు వైయస్‌ఆర్‌ చొరవ తీసుకోబట్టే పోలవరం నిర్మాణానికి కార్యరూపం దాల్చిందన్నారు. ఆయన చలువతోనే ప్రాజెక్ట్‌కు అనుమతులు లభించాయని, ఆయన నిర్మించిన కాల్వల్లోనే ఇప్పుడు నీళ్లు పారిస్తున్నారని తెలిపారు. పోలవరం పూర్తయితే  రైతుల కళ్లలో మహానేత మెదులుతారని టీడీపీకి భయం పుట్టుకుందన్నారు. అందుకే కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును.. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఫర్వాలేదు మాకు పోలవరం ఇస్తే చాలని బాబు తాకట్టు పెట్టారని ఆమె విమర్శించారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదన్నారు. నాడు టీడీపీ నాయకులే పక్క రాష్ట్రాలతో గిల్లికజ్జాలు పెట్టుకొని నీటి సమస్యను జఠిలం చేశారన్నారు. నాడు చంద్రబాబే న్యాయస్థానాల్లో పిటీషన్లు వేశారని గుర్తు చేశారు.

ప్రశ్నిస్తే అభివృద్ధికి అడ్డా?
ప్రభుత్వ వైఫల్యాలను వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నిస్తే..వాటికి సమాధానాలు చెప్పలేక అభివృద్ధికి అడ్డు పడుతున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం దుర్మార్గమని వాసిరెడ్డి పద్మ ఫైర్‌ అయ్యారు. అభివృద్ధిని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ఒకసారి, మరోసారి ప్రతిపక్ష నేతగా వైయస్‌ జగన్‌ ఫెయిల్‌ అయ్యారని టీడీపీ నాయకులు రెండు నాలుకలతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు ప్రత్యేక హోదా తెస్తామంటే వైయస్‌ జగన్‌ అడ్డు పడుతున్నారా?, పోలవరం కడుతుంటే వైయస్‌ జగన్‌ వద్దంటున్నారా సమాధానం చెప్పాలన్నారు. రూ.43 వేల కోట్లకు పోలవరం నిర్మాణ అంచనాలు పెంచి కమీషన్లు దండుకుంటున్నారని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంతో విఫలమైన టీడీపీ సర్కార్‌ ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం చేతగానితనమే అన్నారు. వైయస్‌ జగన్‌ బూచీ చూపి, ఆయన్ను టార్గెట్‌ చేసి బతికి బట్టకడుదామని అనుకోవడం టీడీపీ అవివేకమన్నారు. అధికార పార్టీ నేతలు తీరు మార్చుకోకపోతే ప్రజలు తిరుగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.

   
 
Back to Top