నారాయణ.. నారాయణ!


  • కొనుగోలు 3,600 ఎకరాలు
  • చెల్లించినది 432 కోట్లు
  • ప్రస్తుత విలువ 14,400 కోట్లు
రాజధాని భూసమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. భూదందాలోనూ ముందున్నారు. రాజధాని చుట్టూ వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేసిన ఆయన.. రాజధాని గ్రామాల్లో బినామీ పేర్లతో అత్తెసరు ధరలకే 3,600 ఎకరాల భూములు కొనుగోలు చేశారని అధికారవర్గాలే చెబుతున్నాయి. భూసమీకరణ కింద ఆ భూములు ఇచ్చిన మంత్రి పి.నారాయణకు ఒకే ప్రాంతంలో ఇంటి, వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి దక్కనుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.

3,600 ఎకరాలు కొనుగోలు


భూసమీకరణలో భాగంగా మంత్రి నారాయణ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ మకాం వేసి.. విస్తృతంగా పర్యటించారు, గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ద్వారా అసైన్డు, లంక భూముల రైతులను గుర్తించి, వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అసైన్డు, లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ తన అనుచరులతో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఆందోళన చెందుతోన్న దళిత రైతుల వద్దకు తన ప్రతినిధులతో బేరసారాలు సాగించారు. ఎకరం కనిష్ఠంగా రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. తనకు భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్సు కింద రూ.రెండు లక్షలు ముట్టజెప్పిన నారాయణ.. తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అసైన్డు, లంక భూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో తక్కిన మొత్తాన్ని కూడా తనకు భూమిని అమ్మిన వారికి ముట్టజెప్పేశారు. ఆ రైతుల నుంచి జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తన బినామీల పేర్లపై చేయించుకున్నారు. మొత్తమ్మీద రాజధాని గ్రామాల్లో 3,600 ఎకరాల భూములను మంత్రి నారాయణ కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.

 400 ఎకరాలు ఖాయం...


తుళ్లూరు మండలం బోరుపాలెం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాదు. కాబట్టి నారాయణ ఆ గ్రామంలో అసైన్డు భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క బోరుపాలెంలోనే 50 ఎకరాల అసైన్డు భూమిని కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి లంకల్లోని సర్వే నంబరు 250 నుంచి 400 వరకూ వివిధ సర్వే నంబర్ల పరిధిలోని మరో 50 ఎకరాలపైగా భూమిని కొనుగోలు చేశారు. బోరుపాలెం, రాయపూడి గ్రామాలకు చెందిన తోకల పేతురు, తోకల అంకులు, మెండెం నాగేశ్వరరావు, మెండెం కోటేశ్వరరావు, బుల్లెద్దుల చిన్నప్ప, వలపర్ల రామయ్య, లాలాది ఆదేయ్య, లాలాది సుందరరావు అనే రైతులు తమ భూములను మంత్రి నారాయణకు విక్రయించామని.. ఆ భూములకు సంబంధించిన పత్రాలన్నీ  వారికే అప్పగించామని ‘సాక్షి’తో చెప్పారు. భూసమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. రాజధాని గ్రామాల్లో ఎక్కడ భూములు ఉన్నా.. ఒకే ప్రాంతంలో ఇంటి ప్లాట్లు, వాణిజ్య స్థలం కేటాయించేలా దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మంత్రి నారాయణ హస్తం ఉంది. అంటే.. రాజధాని నగరంలో మంత్రి నారాయణ కోరుకున్న ప్రాంతంలో ఇంటి ప్లాట్లు, వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి లభించడం ఖాయమన్న మాట.

Back to Top