హైదరాబాద్ః అసెంబ్లీలో తమ మాట వినిపించడానికి అవకాశం లేకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలంతా ట్యాంక్‌బండ్ వద్దకు బయల్దేరి వెళ్లారు. ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్నారు. హైకోర్టు ఉత్తర్వులున్నా ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి వినతిపత్రం అందించారు.రోజాను అసెంబ్లీలోకి అనుమతించే అంశంపై సభలో మాట్లాడేందుకు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎంత ప్రయత్నించినా దానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. దాంతో ప్రతిపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఈ గందరగోళం నడుమ తొలుత రెండుసార్లు పదేసి నిమిషాలు వాయిదా పడిన అసెంబ్లీ.. చివరకు సోమవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత బయటకు వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలంతా తొలుత ఎమ్మెల్యే రోజాను పరామర్శించి, ఆమెకు సంఘీభావం తెలిపి, అనంతరం పాదయాత్రగా ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లారు.