సమైక్యాంధ్రలోనే వచ్చే ఎన్నికలు

హైదరాబాద్:

సమైక్యాంధ్రలోనే రానున్న ఎన్నికలు జరుగుతాయని, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమాగా చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్న‌ వైయస్ఆర్‌సీపీ అధ్యుడు శ్రీ వైయస్ జగన్‌పై ఆరోపణలు చేస్తున్న వారికి తద్వారా తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రం విడిపోతుందని తాను భావించడంలేదన్నారు. శ్రీ వైయస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌, టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీ సబ్బం హరి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మేకపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మేకపాటి మాట్లాడారు.

రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తున్న కాంగ్రెస్, తెలంగాణ ఏర్పాటుకు లేఖ ఇచ్చిన టీడీపీల నేతలు కలిసి సమైక్యం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కుట్ర చేస్తున్నారని మేకపాటి దుయ్యబట్టారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి విభజన వాది అంటూ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరని, శ్రీ జగన్ గ్రా‌ఫ్ ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను ప్రజల్లో పర్యటించి వచ్చి చెబుతున్న మాట అ‌న్నారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీని గెలిపించడానికి ప్రజలు కంకణబద్ధులై ఉన్నారని చెప్పారు. సీమాంధ్రలో కొత్త పార్టీ పేరుతో సీఎం కిరణ్‌ను సమైక్య చాంపియన్‌గా చూపించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. అయితే, కాంగ్రెస్, టీడీపీల విధానమే తప్పకుండా బూమరాంగ్‌ అవుతుందన్నారు. ఫిబ్రవరిలోయ జరిగే పార్లమెంటు సమావేశాల్లో విభజన బిల్లు ఆమోదం పొందుతుందన్న నమ్మకం లేదంటూ బీజీపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అనుమానాలు వ్యక్తంచే‌యడాన్ని మేకపాటి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆ‌ర్‌లో చేర్చినందుకు నిరసనగా తనతో పాటు ఎంపీ సబ్బం హరి కూడా రాజీనామా చేయాలని భావించారని.. కానీ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారని రాజమోహన్‌రెడ్డి చెప్పారు. 2011 ఆగస్టు 11న వైయస్ఆర్‌ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించి ఢిల్లీ వెళ్లామన్నారు. సబ్బం హరి మొదట తన రాజీనామాను ఫ్యాక్సు ద్వారా పంపించారని తర్వాత రాజీనామాను నేరుగా స్పీకర్‌కు సమర్పించేందుకు ఆగస్టు 24న ఢిల్లీకి తనతో కలిసి వచ్చారని, తాను మాత్రమే లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇవ్వగా సబ్బం హరి ఇవ్వలేదని చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై సబ్బం హరి ఎందుకు విషం కక్కుతున్నారో అర్థం కావడం లేదని మేకపాటి అన్నారు.

జైలు నిర్బంధంలో ఉన్నప్పటికీ సమైక్యాంధ్ర కోసం శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారని, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ కూడా గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైనాన్ని మేకపాటి గుర్తుచేశారు. చివరికి జైలు నుంచి బెయిలుపై బయటికి వచ్చిన తరువాత కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శ్రీ జగన్‌ మళ్ళీ నిరవధిక నిరాహార దీక్ష చేసి సమైక్య ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. అయితే.. సీఎం కిరణ్‌ మాత్రం సోనియా ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారని మేకపాటి ఆరోపించారు. రాష్ట్ర విభజన జరగబోదన్న సమాచారం తన వద్ద ఉన్న కారణంగానే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడం లేదని అన్నారు.

ఆర్టికల్‌ 3ని దుర్వినియోగం కాకుండా సవరించడానికి మద్దతు కూడగట్టేందుకు శ్రీ జగన్‌ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నాయకులను కలిశారని మేకపాటి చెప్పారు. శ్రీ జగన్‌ మాట్లాడిన తరువాత ఆయా పార్టీల నాయకులలో కొందరు నాయకులు ఆర్టికల్ 3 సవరణకు అంగీకరించారని అన్నారు. సమైక్యాంధ్ర విషయంలో శ్రీ జగన్‌ విధానం చాలా ప్రస్ఫుటంగా ఉందన్నారు. అయితే, సమైక్యం ముసుగులో శ్రీ జగన్‌ విభజనకు సహకరిస్తున్నారంటూ కాంగ్రెస్, టీడీపీ, సబ్బం హరి మూకుమ్మడిగా ఆరోపించడాన్ని మేకపాటి తప్పుపట్టారు.

శ్రీ వైయస్ జగ‌న్‌పై ప్రజల్లో ఉన్న అభిమానం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి తిరునాళ్లుగా మారుతుంద‌ని మేకపాటి అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది కనుక సీమాంధ్రలో ఘన విజయాలు సాధిస్తుందని, తెలంగాణలోనూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ ‌పార్టీ చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.

Back to Top