ప్రజలు ఏవగించుకుంటున్నారు

చంద్రబాబు అరాచక క్రీడల్ని జాతీయస్థాయిలో ఎండగడతాం
పదవులు, డబ్బులకు ఆశపడే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు 
పార్టీ ఫిరాయింపులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు
రానున్న రోజుల్లో బాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారుః మేకపాటి

ఢిల్లీః ఏపీలో చంద్రబాబు సాగిస్తున్న అరాచక రాజకీయ క్రీడల్ని రాష్ట్రపతి, ప్రధాని సహా జాతీయ, ప్రాంతీయ పార్టీ నాయకులను కలిసి వివరిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. సంతలో పశువులను కొన్నట్లు అత్యంత నీచంగా బాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని మేకపాటి మండిపడ్డారు.  బాబు అరాచక రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు . నీతివంత పాలన సాగిస్తానని చంద్రబాబు చెప్పుకోవడం  హాస్యాస్పదమని మేకపాటి తూర్పారబట్టారు.  ఎమ్మెల్యేలను కొనడమేనా బాబు మీ నీతి అని చురక అంటించారు. చంద్రబాబు దుర్మార్గపు చేష్టలను యావత్ ప్రజానీకం చీధరించుకుంటోందని,  రానున్న రోజుల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

ప్రభుత్వానికి వచ్చే ప్రమాదమేమీ లేకున్నా,  సంపూర్ణ మెజారిటీ ఉన్నా కూడా చంద్రబాబు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో లాక్కోవడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయాలన్న తలంపుతోనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.  అధికార, ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్య మనుగడ ఉంటుందని మేకపాటి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీడీపీ నేతలంతా టీఆర్ఎస్ లో చేరుతుండడంతో ...అక్కడి పరిస్థితినే చంద్రబాబు ఇక్కడ చేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. 

తెలంగాణలో టీడీపీ మసకబారిపోయినా బాబు ఇంకా జాతీయ పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకోవడం విడ్డూరమన్నారు.  బాబు ఏపీకే పరిమితమని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పై ప్రజాభిమానం సునామీలాగా ఉందని మేకపాటి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తన అనుకూల మీడియాతో వైఎస్ జగన్ పై రకరకాల దుష్ర్పచారం చేయించి ప్రజలను నమ్మించిండం వల్ల, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం వల్లే గెలిచిందన్నారు. 
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చంద్రబాబు  అపహాస్యం చేస్తున్నారని మేకపాటి ఫైరయ్యారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకుండా  స్పీకర్ చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. 

గతంలో పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ రాజీనామా చేయించి మళ్లీ వారిని ఎన్నికల్లో గెలిపించుకున్న విషయాన్ని మేకపాటి గుర్తు చేశారు. రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం దుర్మార్గమన్నారు. టీడీపీలోకి వెళుతున్న ఎమ్మెల్యేలంతా చంద్రబాబు సొమ్ములు, పదవులకు ఆశపడి వెళుతున్నారే తప్ప...ప్రజల కోసం కాదని రాజమోహన్ రెడ్డి చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన మూడు మాసాల్లోనే అనర్హత వేటు వేసేలా.... చట్టంలో సవరణ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేకపాటి అభిప్రాయపడ్డారు. 

ప్రజాస్వామ్య మనుగడ కొరకు భావితరాలకు ఓ మెసేజ్ అందించేలా ఈసవరణ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వప్రయోజాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని, ఫిరాయింపులను చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని మేకపాటి అన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు పదవులు, డబ్బులతో పాటు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారని దుయ్యబట్టారు.  2026 వరకు నియోజకవర్గాల పెంపు లేకున్నా...అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి టికెట్ ఇస్తామంటూ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకునేందుకు ఈ సమావేశాల్లోనే ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈఅంశాన్ని సభలో ప్రస్తావిస్తామని, దీనికి అందరూ ఆమోదిస్తారని భావిస్తున్నామన్నారు. 

Back to Top