ప్రాణమున్నంత వరకు వైయస్ జగన్‌ వెంటే

- అసత్య కథనాలు మానుకోవాలి
- నంద్యాల ఎన్నికపై విచారణ జరిపించాలి
- నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

నెల్లూరు (సెంట్రల్‌) : తన ప్రాణం ఉన్నంత వరకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ నవరత్నాల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను పార్టీ మారతానంటూ కొన్ని పత్రికలు తనపై పనిగట్టుకుని అసత్య కథనాలు రాస్తుండగా.. కొన్ని చానల్స్‌ తప్పుడు ప్రసారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తన వ్యాపారాల కోసం కేంద్రంలోని అధికార పార్టీలో చేరతానంటూ ప్రచారం చేయడం విలువలు లేని రాతలని ధ్వజమెత్తారు. గతంలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో అప్పటి కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా తాను ఎంపీ పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తినని, అలాంటి తనపై పార్టీ మారుతారంటూ ఏ విధంగా కథనాలు రాసి, ప్రసారాలు చేస్తారని ప్రశ్నించారు. ఇటువంటి తప్పుడు కథనాలు రాయడం మానుకోవాలని హితవు పలికారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అరాచకం, ప్రలోభాలపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని కోరారు. కోట్లాది రూపాయాలు ఖర్చు చేసి ఎన్నికవడం కూడా ఒక విజయమేనా అని విమర్శించారు. చంద్రబాబు ఇదేవిధంగా కొనసాగితే ప్రజాస్వామ్యానికి మనుగడ కష్టం అవుతుందన్నారు. భూమా కుటుంబాన్ని గతంలో టీడీపీ ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో గుర్తుపెట్టుకోవాలన్నారు. సమావేశంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top