దీక్షలో ఉన్న జగన్‌కు జైలులో వైద్య పరీక్షలు

హైదరాబాద్, 26 ఆగస్టు 2013:

రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ చంచల్‌గూడ జైలులోనే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి జైలు వైద్యుల చేత అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. సాయంత్రం మరోసారి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. శ్రీ జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 6 గంటలకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్తు బులెటిన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, ప్రజల పక్షాన ఆదివారం ఉదయం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ జగన్‌ సోమవారం ఉదయం వరకూ ఎలాంటి ఆహారమూ తీసుకోలేదని చంచల్‌గూడ జైలు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం కూడా అల్పాహారం తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. అన్నపానీయాలు ముట్టకోకపోవడంతో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్షకు దిగి సోమవారానికి 30 గంటలు దాటింది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆయన తన నిరశన దీక్ష మొదలుపెట్టారు. అప్పటి నుంచి శ్రీ జగన్ ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. ‌ఆదివారం సాయంత్రం నుంచీ ఆయనకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. శ్రీ జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వెల్లడించే వివరాలను ఎప్పటికప్పుడు‌ జైలు అధికారులు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దీక్ష విరమించాలని జైలు అధికారులు కోరినప్పుడు శ్రీ జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు ‌సమాచారం.

జైలు పరిసరాల్లో భారీ భద్రత :
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయానికి నిరసనగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మరోవైపు శ్రీ జగన్‌కు మద్దతుగా.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్న జైలు అధికారులు.. చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు బలగాలను భారీ ఎత్తున మొహరించారు. ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. మరో వైపున శ్రీ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు సీమాంధ్రజిల్లా‌ల్లో పెద్దఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎక్కడిక్కడ రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.

తాజా ఫోటోలు

Back to Top