మేయర్ పీఠం మనదే కావాలి

  • చంద్రబాబుపై ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకత
  • అదే సమయంలో ‘గడప గడప’కూ చేరువయ్యాం
  • ఈ రెండు అంశాలనూ సద్వినియోగించుకోవాలి
  •  వైయస్సార్‌సీపీ శ్రేణులకు విజయసాయిరెడ్డి ఉద్బోధ
  • విశాఖలో రోజంతా బిజీబిజీగా గడిపిన ఎంపీ
విశాఖపట్నం: ‘విశాఖ నగర మేయర్‌ పీఠం మనకే దక్కాలి.. అందుకోసం పార్టీ శ్రేణులు మరింత శ్రమించాలి. గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం వంద రోజుల నుంచి విజయవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యాం. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి’.. అని రాజ్యసభ సభ్యుడు,  వి.విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం  ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు. తొలుత ఉదయం నగరంలోని సీతమ్మధార ఎంపీ పార్టీ కార్యాలయంలో జిల్లా, నగరంలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతల సమక్షంలో కొత్త సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు, పార్టీ అభిమానులకు ఆయన ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉత్తర నియోజకవర్గ నాయకులు, మహిళా నేతలతో సమావేశమయ్యారు. మహిళా నాయకులు కూడా పార్టీ అభివృద్ధికి పాటు పడుతున్నారని, చైతన్యవంతంగా ఉన్నారని విజయసాయిరెడ్డి అభినందించారు. పార్టీ పటిష్టానికి తీసుకోవలసిన అంశాలపై వారితో చర్చించారు.

సాయంత్రం ఉత్తర నియోజకవర్గం పరిధిలోని 35వ వార్డు కస్తూరీనగర్‌లో గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రత్యేకంగా తయారు చేయించిన 100 రోజుల కేక్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత రాత్రి పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కొత్తపాలెంలోనూ గడపగడపకు 100 రోజుల కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పార్టీ నాయకులు, శ్రేణులను ఆయన అభినందించారు. ఇదే ఊపును మున్ముందు కూడా కొనసాగించాలని సూచించారు. గడపగడపకు వైయస్సార్‌ ద్వారా ప్రజలకు బాగా చేరువయ్యామని, పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం కూడా ఇదేనని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు  అంతా కృషి చేయాలని కోరారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికుతోందన్నారు. అందువల్లే జీవీఎంసీ ఎన్నికలంటే బాబుకు భయం పట్టుకుందన్నారు. ప్రజలకు చేరువకావడం ద్వారా రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠం దక్కించుకోవచ్చని, ఆ దిశగా పార్టీ శ్రేణులు కష్టించి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
Back to Top