మౌనం వీడండి.. న్యాయం చేయండి

ప్రధాన మంత్రి
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి,
సర్,

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఉపఎన్నికల ప్రచారం చేస్తుండగా 2012 మే 27న నా భర్త శ్రీ వై.యస్.జగన్మోహన్‌ రెడ్డిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ అంటే ఏడాది కాలంగా ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి మీకు తెలిసిందే. ఓ భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యగా, ఓ తల్లిగా నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను. మిమ్మల్ని గురుతర బాధ్యతల్ని నిర్వర్తించేందుకు శాయశక్తులా యత్నించే వ్యక్తిగా భావిస్తూ కూడా నేను ఈ లేఖ రాస్తున్నాను. ఈ కేసులో ఇటీవలి పరిణామాలు మా అందరినీ దిగ్భ్రాంతికి, భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ లేఖ రాయక తప్పడం లేదు. ఈ కేసులో దర్యాప్తు తీరు మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల ప్రకారం జరగడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

శ్రీ వై.యస్.జగన్మోహన్‌ రెడ్డికి సంబంధించి (ఆర్‌సీ: 19ఏ/2011-సీబీఐ-హైదరాబాద్) గడచిన 22 నెలలుగా దర్యాప్తు సాగుతోంది. ఈ దర్యాప్తు పూర్తి చేయడానికి మూడు నెలల గడువు కావాలని 2012 అక్టోబర్‌లో సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. అది జరిగిన 8 నెలల తర్వాత.. అంటే 2013 మే నెలలో బెయిల్ కోసం మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు.. దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 4 నెలలు కావాలని సీబీఐ కోరింది. దీంతో దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 4 నెలల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ తర్వాత మాత్రమే శ్రీ జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ బెయిల్ కోరవచ్చని పేర్కొంది.

అయితే, తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే సీబీఐ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు పూర్తి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దిష్ట కాల పరిమితికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, గడువు పొడిగించడానికి అవసరమైన కారణాలు తాము వెతుకుతామని సంకేతాలిచ్చారు. దర్యాప్తును చిత్తశుద్ధితో పూర్తి చేయాలన్న ఆలోచన సీబీఐకి ఏ మాత్రమూ లేదని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సీబీఐ పనితీరు ఆత్మ ప్రబోధానుసారం సాగుతోందనిగాని లేదా స్వతంత్రంగా సాగుతోందనిగాని నాకు అనిపించడం లేదు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఉన్న డీవీడీని ఈ లేఖతో జతచేసి మీకు పంపిస్తున్నాను.

తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లతో సాగుతున్న సీబీఐ దర్యాప్తునకు సంబంధించి, నా భర్త నిర్బంధానికి సంబంధించి పలు వాస్తవాలను మీ ముందు ఉంచదలిచాను. అవి..

* దర్యాప్తు జరిపిస్తున్న హయాం అంటే.. 2004-09 కాలంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నా భర్తకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన ఎంపీ కాదు. ఎమ్మెల్యే కూడా కాదు. ఆ సమయంలో.. అంటే 2001 నుంచి మేము బెంగళూరులో నివసిస్తున్నాం. నిజాయితీ కలిగిన వ్యక్తిగా, ఓ మంచి వ్యాపారవేత్తగా ఆయన పలు ప్రాజెక్టులు మొదలుపెట్టారు. జల విద్యుత్ కేంద్రాల్లో వివేచనతో పెట్టుబడులు పెట్టారు.

* మా మామగారు మరణించిన 15 నెలల తర్వాత, కాంగ్రెస్ పార్టీని శ్రీ జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టిన నెల తర్వాత, ఆ పార్టీ ఎమ్మెల్యే పి. శంకర్రావు.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌పైన, శ్రీ జగన్మోహన్ రెడ్డిపైన ఆ లేఖలో పలు ఆరోపణలు చేశారు. మా మామగారి ప్రభుత్వంలో ఆయన భాగంగా ఉన్న 6 సంవత్సరాల్లో ఏ రోజూ ఆయన ఈ ఆరోపణలు చేయలేదు. ఆయన లేఖ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా మారిన వెంటనే ఆయనకు రివార్డులు అందాయి. రాష్ట్ర క్యాబినెట్‌లో ఆయన మంత్రి పదవి అందుకున్నారు. ఆ తర్వాత ఆయన పిటిషన్‌లో తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అయ్యింది. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని స్పష్టమైంది.

హైకోర్టు తీర్పులో నా భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి 52వ ప్రతివాది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వానికి సంబంధించిన ఇతరులు 1 నుంచి 15 వరకు ప్రతివాదులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా స్పందించరాదని నిర్ణయించుకుంది. స్పందించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ, జీవించి లేని వ్యక్తిపై దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆయన మరణించిన 15 నెలల తర్వాత, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వదిలేసిన తర్వాత ఇది చోటుచేసుకుంది.

* రాష్ట్ర ప్రయోజనాల కోసం తన సహచరులతోపాటు తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకోవడానికి మా మామగారు ఇప్పుడు జీవించి లేరు. బాధాకరమైన విషయమేంటంటే.. ఆయన కేబినెట్ సహచరులందరూ ఇప్పుడు జీవించే ఉన్నప్పటికీ, స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నప్పటికీ.. నాడు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధమూ లేని నా భర్త మాత్రం జైల్లో మగ్గుతున్నారు. ఆయన ఒక ఎంపీ అయినప్పటికీ కూడా..‘‘దర్యాప్తును ప్రభావితం చేస్తారు’’ అని, ‘‘శక్తిమంతుడు’’ అని సాకులు చెబుతూ ఆయన్ను జైల్లోనే ఉంచుతున్నారు.

* శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేకపోవడంతో.. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వివరణ ఇచ్చే స్థితిలో ఆయన లేరు. ప్రస్తుత మంత్రులకు మాత్రం ఆ అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం వారి వ్యాజ్యాలకయ్యే ఖర్చులను భరించాలని నిర్ణయించుకోవడం ద్వారా వారికి క్లీన్‌చిట్ ఇచ్చేసింది. మరో విషయమేంటంటే, ప్రభుత్వ బిజినెస్ రూల్సు ప్రకారమే ఆ జీవోలన్నీ జారీ అయ్యాయంటూ ఆయా మంత్రులు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

* సీబీఐ దర్యాప్తు అధికారి జాయింట్ డెరైక్టర్ ఉద్దేశపూర్వకంగా ఈ కేసును జాప్యం చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. నా భర్త నేతృత్వంలోని రాజకీయ పార్టీ ఇదే అంశాన్ని బయటపెట్టింది. నా భర్తకు, పార్టీకి వీలైనంత ఎక్కువగా నష్టం కలిగించేలా ఆయన దర్యాప్తుపై ఏకపక్ష సమాచారాన్ని, నిర్దిష్ట లీకులను ఇచ్చారు. దీనిపై పలువురితోపాటు పార్టీ కూడా నిరసన వ్యక్తంచేసింది. సీబీఐ దురుద్దేశపూరిత వైఖరిపై ఇదివరకే ఫిర్యాదు చేశాం. వ్యతిరేక వార్తలు రాస్తూ నా భర్తకు, ఆయన పార్టీకి శత్రువుల్లా వ్యవహరించే నిర్దిష్ట మీడియా సంస్థలకు జాయింట్ డెరైక్టర్ చేసిన 500కుపైగా ఫోన్ కాల్సు వివరాల జాబితాను కూడా ఆ ఫిర్యాదుకు జతచేశాం. నా భర్త ప్రతిష్టకు భంగం కలిగించే హక్కు వీరికి ఎవరిచ్చారు?

సాక్షి అనేది నకిలీ ఇన్వెస్టర్లు తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బునుదాచుకునేందుకు.. రాత్రికి రాత్రి పుట్టించిన డమ్మీ కంపెనీ కాదు. ప్రారంభమైన ఐదేళ్లలోపే ‘సాక్షి’ 1.43 కోట్ల మంది పాఠకులను ఆకట్టుకుని.. ఈ రోజు దేశంలోనే ఏడో స్థానంలో నిలిచింది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారందరూ రెండింతలు లాభం పొందారు. వారి వాటా ధ్రువపత్రాలన్నీ కూడా వారి వద్దే ఉన్నాయి. వారికి నచ్చినప్పుడు నచ్చినవారికి తమ వాటాలను అమ్ముకునే స్వేచ్ఛ వారికుంది. రూ. 1,800 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న ‘ఈనాడు’ సంస్థ రూ. 100 విలువైన వాటాను రూ. 5.26 లక్షలకు విక్రయించినప్పటికీ.. ‘సాక్షి’ విలువను ‘ఈనాడు’ విలువలో సగానికే మదింపు చేశారు. అయినప్పటికీ ఇది తప్పన్నట్లు సీబీఐ ప్రశ్నిస్తోంది. వాటాదారులకు లాభాలు తెచ్చిపెట్టినందుకు, 40 వేల మందికిపైగా కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నందుకు నా భర్తను ఏకాకిని చేసి వేధిస్తున్నారన్నది సుస్పష్టం.

* సీబీఐ దర్యాప్తులో ముఖ్యమైన వాన్‌పిక్ ప్రాజెక్టు.. కాల్దర్-హిక్సు ఎఫిషియెన్సీ సిద్ధాంతానికి(దీని గురించి మీకు బాగా తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నాను) అద్దం పడుతోంది. ఇదే ప్రాజెక్టు గురించి మీకు రస్ అల్ ఖైమా ప్రభుత్వం లేఖ రాసింది కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని బాగా వెనుకబడిన రెండు జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు/ప్రభుత్వాలకు ఇచ్చిన ఉదంతాలు ఇంతకు ముందూ ఉన్నాయి. రస్ అల్ ఖైమా చంద్రబాబు హయాం నుంచీ కూడా రాష్ట్రంలో ప్రాజెక్టులు చేస్తోంది.

నేను బ్రిటిష్ పాలనలో లేని, చట్టం ముందు అంతా సమానమని నమ్మే సర్వసత్తాక, స్వతంత్ర భారతదేశంలో జన్మించాను. ఇక్కడ ప్రతి వ్యక్తికీ జీవించే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాను. దేశంలో రాజ్యాంగమే సమున్నతమని, న్యాయం ఉందని, చట్టం ముందు అంతా సమానమేనని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.

నా భర్తకు ఏ ప్రభుత్వ నిర్ణయాలతోనూ సంబంధం లేదు. ఆయన ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జీతంగా పొందలేదు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాటాదారులకు లాభాలు తెచ్చిపెట్టారు. అలాంటి వ్యక్తిని దర్యాప్తు పేరుతో గత ఏడాది కాలంగా జైల్లో పెట్టారు. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులు అన్న కారణంగా రాబర్టు వాద్రా, డింపుల్ యాదవ్‌లపై దర్యాప్తులను నిలిపివేశారు. మరి శ్రీ జగన్మోహన్ రెడ్డికీ, వారికి తేడా ఏమిటని నేను అడుగుతున్నా. శ్రీ జగన్ కూడా ప్రైవేటు వ్యక్తే అయినప్పుడు ఇలా ఎందుకు వేధిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని వీడినందుకేనా?

సార్వత్రిక ఎన్నికల వరకు నా భర్తను జైల్లోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం చేతిలోని సీబీఐ భావిస్తోంది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనని విశ్వసించడానికి సహేతుక కారణాలు ఉన్నాయి. ఇటీవల కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు మీ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఏడాది కిందట ఎన్డీటీవీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌కు రాజకీయ అస్త్రాలు ఉన్నాయని వీరప్ప మొయిలీ అన్నారు. అందుకు నేను స్పందిస్తూ.. ఆ అస్త్రాల్లో సీబీఐ కూడా ఉందా అని ప్రశ్నించా. ఈ విషయంలో దేశంలో ఈరోజు ఎవ్వరికీ అనుమానం లేదన్నది వాస్తవం.

దురదృష్టవశాత్తూ, కుటిల రాజకీయాల కారణంగా నేను, నా పిల్లలు త్యాగాలు చేయాల్సి వస్తోంది. తన తండ్రి చనిపోయిన చోట శ్రీ జగన్మోహన్ రెడ్డి ఒక మాటిచ్చారు. ఆ మాటకే కట్టుబడి ముందుకు నడిచారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలే కన్నుమూసినవారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు శ్రీ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. వెంటనే సీబీఐని రంగంలోకి దించింది. శ్రీ జగన్ నిర్ణయానికి మా కుటుంబం మద్దతుగా నిలిచింది. మా కుటుంబ పెద్దను మాకు దూరంగా ఉంచేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ మౌనంగా చూస్తూ నిలవాల్సి వచ్చినందుకు శోకిస్తున్నాం. ఆయన రాజకీయ నేత అయినప్పటికీ.. మాకు ప్రశాంతంగా జీవించే హక్కుంది. తండ్రి సంరక్షణలో పెరిగే హక్కు మా పిల్లలకు ఉంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో మీకు ఒక విన్నపం చేస్తున్నా. ఈ విషయంలో మీరు చొరవ చూపడం ద్వారా న్యాయానికి, సమానత్వానికి దేశం దన్నుగా నిలుస్తుందన్న నమ్మకాన్ని దేశ పౌరులు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగేలా చేయాలని కోరుతున్నాను. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడరాదన్న సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.

సర్, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ప్రజల హక్కుల కోసం నిలబడిన నేతగా మిమ్మల్మి ఈ దేశం గుర్తుంచుకునేలా చేయండి. మూడు దశాబ్దాలుగా దేశానికి సేవ చేసిన వ్యక్తికి, మీ పార్టీ కోసం ముందుండి పోరాడిన సైనికుల్లో ఒకరైన దివంగత మహానేత శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే మౌనం దాల్చిన వ్యక్తిగా మిగిలిపోకండి.

కృతజ్ఞతలతో...

ఇట్లు
వైయస్ భారతీరెడ్డి


(సాక్షి సౌజన్యంతో)

Back to Top