మార్షల్స్ తో దాడి చేయిస్తారా..?

హైదరాబాద్ః  ఆనాడు రాష్ట్ర విభజనకు మద్దతిచ్చి ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబు...ఇవాళ మరోసారి ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి ఏపీ ప్రజలను దగా చేశారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. హోదాపై చర్చకోరితే మార్షల్స్ తో తమపై దాడి చేయించడం అన్యాయమని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. 

చర్చపై దమ్ములేక మార్షల్స్‌తో దాడి
ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు
హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై చర్చకు వచ్చే దమ్ములేక చంద్రబాబు ప్రభుత్వం మార్షల్స్‌తో ప్రతిపక్షాన్ని సభ నుంచి బయటకు పంపించాలని చూస్తోందని ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రిగా పోరాడాల్సిందిపోయి హోదాపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్యాకేజీపై లోపాయకర ఒప్పందం జరిగింది గనుకే చంద్రబాబు అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్ర భవిష్యత్తు తనకేమీ పట్టనట్లుగా మిగిలిన 2 సంవత్సరాలు ఏదోవిధంగా గడిపేద్దామనే దోరణిలో ఉన్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో జరిగిన మార్షల్స్‌ చర్యను ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. 

మార్షల్సే దాడి చేశారు
ఎమ్మెల్యే ముస్తఫా
ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని పోడియం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై మార్షల్సే దాడి చేశారని ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు. హోదా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దానిపై చర్చించాలని తాము డిమాండ్‌ చేస్తే..మంత్రి యనమల సభ లోటస్‌పాండ్‌ కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏపీకి హోదా రాకపోతే తీవ్రంగా నష్టపోతామని, ఆవిషయాన్ని అధికార పార్టీ గుర్తించాలని హితబోధ చేశారు. 

హోదా కేంద్రానికి తాకట్టు
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా అంశాన్ని కేసుల నుంచి బయటపడేందుకు సీఎం చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. హోదాను బాబు తన సొంత వ్యవహారంలా భావించి యువత భవిష్యత్తును సర్వ నాశనం చేసేలా ప్యాకేజీకి అంగీకరించారని విమర్శించారు. ఇంత అన్యాయం జరుగుతున్నా టీడీపీ సభ్యులు చర్చకు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు.

మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు
ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
ప్రత్యేక హోదాపై రాష్ట్ర్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హోదాపై జరిగిన అన్యాయంపై అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అర నిమిషం సమయం ఇచ్చారని, రెండో రోజు హోదాపై చర్చిద్దామంటే ప్రభుత్వం పారిపోయిందని ధ్వజమెత్తారు. సభలో ప్రతిపక్షం గొంతు నొక్కారని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాలను దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు.

మోసం బాబు మొదటి అలవాటు
ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి
హైదరాబాద్‌: మాయమాటలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటు అని వైయస్‌ఆర్‌ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆంధ్రరాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల హోదా డిమాండ్‌ను పక్కనబెట్టి ప్యాకేజీకి ప్రాధాన్యత ఇస్తూ మరోమారు వారిని మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ జరగాలని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ పట్టుబడుతుంటే సర్కార్‌ భయంతో పారిపోతుందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ విషయంలో బాబు అవినీతి బయటపడుతుందని అసెంబ్లీలో మార్షల్స్‌ను పెట్టి చర్చను అడ్డుకోవాలని ఎమ్మెల్యేలపై దాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్థం, ఓటుకు కోట్ల కేసు నుంచి బయటపడడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రజల మనోభావాలకు అనుగూనంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కోల్పోవడంతో, ప్రతిపక్షంగా ప్రజల తరుపున నిలబడి హోదా చర్చకు పట్టుబడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు హక్కుగా భావిస్తున్న ప్రత్యేక హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

వెంకయ్యనాయుడు ఏపీని అవమానిస్తున్నాడు
ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
హైదరాబాద్‌: చట్టసభలో మార్షల్స్‌ను పెట్టి నిర్వహించిన ప్రభుత్వ తీరు దుర్మార్గమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మార్షల్స్‌ను పెట్టే సభను, జీవోలను, చట్టాలను తయారు చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల మాటలను, ప్రజా సమస్యలను పట్టించుకోరా అని ప్రశ్నించారు. తలుపులు వేసుకొని పార్లమెంట్‌లో అడ్డగొలుగా విభజించిన ఆంధ్రకు మేలు జరగాలంటే ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌లు, ప్రస్తుతం ప్రెస్‌మీట్‌లు పెట్టి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారన్నారు. కొండలు, గుట్టలు ఉన్న రాష్ట్రాలకి హోదా ఎలా ఇస్తారని వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌లో హోదా కోసం డిమాండ్‌ చేసినప్పుడు తెలియదా అని కొరుముట్ల ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదానే సంజీవని అని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారని, హోదా పోరాటంలో ప్రతిపక్షంపై ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. హోదా విషయంలో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకు అసెంబ్లీలో చర్చకు దిగామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ప్రభుత్వాలను హెచ్చరించారు. 

ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్న టీడీపీ
ఎమ్మెల్యే కోన రఘుపతి
హైదరాబాద్‌: శాసనసభలో సభ్యుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. హోదాను విడిచిపెట్టి ప్రత్యేక ప్యాకేజీకి ప్రభుత్వం ఎందుకు ఆమోదించిందని ప్రశ్నించారు. ప్యాకేజీని ఏ విధంగా ఒప్పుకున్నారో ప్రతిపక్షానికి, ప్రజలకు వివరించండి అని అసెంబ్లీలో మాట్లాడేతే స్టేట్‌మెంట్లు ఇస్తాం కావాలంటే క్లారిటీ తీసుకోకుండి అంటూ మాట్లాడుతున్నారని చెప్పారు. చర్చపై స్పీకర్‌తో మాట్లాడాలని చూస్తే మార్షల్స్‌ను పెట్టుకొని అడ్డుపడే దుర్మార్గపు చర్యకు పాల్పడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. హోదాపై చర్చకు అసెంబ్లీని మించిన వేదిక ఎక్కడా దొరకదని, ప్రభుత్వాన్ని చర్చకు రమ్మని నిలదీస్తున్నామన్నారు. చంద్రబాబు స్వాగతించిన ప్యాకేజీ వల్ల కొంతమంది టీడీపీ నేతలకు మేలు జరుగుతుంది తప్ప ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. 

హోదా జీవన్మరణ సమస్య
ఎమ్మెల్యే అంజద్‌ బాషా
 ప్రత్యేక హోదా 5 కోట్ల ఆంధ్రప్రజల జీవన్మరణ సమస్య అని కడప ఎమ్మెల్యే అంజద్‌ బాషా స్పష్టం చేశారు. విభజనతో అన్యాయానికి గురైన ఏపీకి హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయంలో చంద్రబాబు కేంద్రంతో కుమ్మకై ప్యాకేజీని స్వాగతించడం దుర్మార్గమన్నారు. ప్యాకేజీ వల్ల చంద్రబాబు, టీడీపీ నేతలకు తప్ప ఎవరికీ ఉపయోగం లేదన్నారు. ప్రజల గొంతుగా అసెంబ్లీలో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ స్పీకర్‌ పోడియం వద్ద శాంతియుత నిరసన తెలుపుతుంటే టీడీపీ నేతలు మార్షల్స్‌తో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సభలో ఇంత భయానక వాతావరణం సృష్టించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. 
Back to Top