మరోసారి బహిర్గతమైన బాబు నైజం: గట్టు

హైదరాబాద్, 20 మే 2013:

కళంకిత మంత్రులను తొలగించాలని రాష్ట్రపతిని కోరినప్పుడే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైజం బయటపడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ప్రస్తుత రాష్ట్ర క్యాబినెట్‌ను కాకుండా మంత్రులనే తొలగించాలని కోరడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని ఆయన చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.  పాదయాత్ర తరవాత చంద్రబాబు రాష్ట్రపతిని కలుస్తానంటే నిజాయితీపరుడిగా నిరూపించుకోవడానికి తనపై సీబీఐ విచారణ చేయండని కోరతారేమోననుకున్నానని ఆయన చెప్పారు. క్యాబినెట్ మొత్తానికి పాలించే హక్కు లేదనీ, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరతారనుకున్నాననీ, కానీ ఎప్పుడో ప్రచురించిన మూడు పుస్తకాలను పట్టుకెళ్ళి కళంకిత మంత్రుల్ని తొలగించాలని రాష్ట్రపతిని ఆయన అడిగారనీ వివరించారు. జగన్ గారి కేసు విషయంలో 26 జీవోలు ప్రాధాన్యత సంతరించుకున్నాయనీ,  ఆ జీవోలు సక్రమమైనవైనప్పుడు ఆ మంత్రులు కళంకితులుకారనీ పేర్కొన్నారు. జీవోలు తప్పయితే అది క్యాబినెట్ తప్పని మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. క్యాబినెట్‌ని కాకుండా ఒకరో ఇద్దరో మంత్రులను తొలగించాలని అడగడంతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత పచ్చిగా సమర్థిస్తున్నారో తేటతెల్లమైందన్నారు. తద్వారా ప్రజల్ని మోసగించడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో కూడా అర్థమవుతోందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి బ్రాంచ్ ఆఫీస్ టీడీపీ
కాంగ్రెస్ పార్టీకి బ్రాంచ్ ఆఫీసుగా టీడీపీ మారిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడానికి ఒక డ్రామా మొదలుపెట్టారని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు గానీ, నాయకులు గానీ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నాయకులను కలిసినప్పుడల్లా వారు చెప్పిన అంశాన్ని తుచ తప్పకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిగారికి వ్యతిరేకంగా అమలుచేస్తున్నారని గట్టు విమర్శించారు. ఈరోజు చంద్రబాబు వెళ్ళి రాష్ట్రపతిని కలిసిన వెంటనే ఇద్దరు మంత్రులను తొలగించారన్నారు. అంటే బాబు ఢిల్లీ వెళ్ళడానికీ, కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోవడానికి వెనుక సంబంధం ఉందని ఆయన స్పష్టంచేశారు. ఆ మంత్రుల్ని తొలగిస్తే ప్రభుత్వాన్ని కాపాడతాననే భరోసా చంద్రబాబునుంచి లభించింది కాబట్టే ఆమేరకు కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారని తెలిపారు. లేకుంటే ఆ మంత్రుల్ని కచ్చితంగా తొలగించి ఉండేవారు కారని స్పష్టంచేశారు.  సుప్రీం కోర్టులో విచారణ సందర్భంలో జివోల జారీ క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయమని చెబుతారనీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా మాట్లాడతారనీ ఆయన చెప్పారు. ఈ డ్రామాను నడిపితే చంద్రబాబేననీ, ఆడుతున్నది కిరణ్ కుమార్ రెడ్డనీ చెప్పారు.

బాబు నిర్ణయమైతే ఉమ్మడి వేరొకరిదైతే వ్యక్తిగతమా
చంద్రబాబు అధికారంలో ఉండగా తీసుకున్న మద్యం విధానం క్యాబినెట్ నిర్ణయమనీ, ఇది నచ్చకపోతే ప్రజలే తీర్పుచెబుతారనీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఐఎమ్‌జీ కేసులో కూడా ఇదే జరిగిందన్నారు. చంద్రబాబు విషయానికి వస్తే క్యాబినెట్ ఉమ్మడి బాధ్యత అంటారనీ, కాంగ్రెస్ విషయానికోస్తే ఇద్దరు ముగ్గురు మంత్రులదే బాధ్యతని ఓట్రిస్తారనీ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతికి చంద్రబాబు ఇచ్చిన పుస్తకంలో తనచేత వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బలవంతంగా రాయించారని డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గట్టు గుర్తుచేశారు. చంద్రబాబు మీద సీపీఎం పార్టీ ప్రచురించిన 'బాబు జమానా.. అవినీతి ఖజానా' అనే పుస్తకాన్ని రాష్ట్రపతికి ఎందుకు చూపెట్టుకోలేదని ఆయన నిలదీశారు. బీజేపీ వేసిన చార్జిషీటును కూడా రాష్ట్రపతికి ఇచ్చుంటే బాగుండేదన్నారు.
జగన్మోహన్ రెడ్డిని ఇరుకునపెట్టేందుకు ఈ నాటకం
జీఓల అంశాన్ని ఓ చనిపోయే వ్యక్తిపై బాధ్యత నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒకరిద్దరు మంత్రులు చెప్పుడుమాటలు విని మోసపోయారని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.  చనిపోయిన రాజశేఖరరెడ్డి గారు ఎలాగూ రాలేరు కాబట్టి ద్వంద్వ నీతిని పాటిస్తూ నిందలు మోపుతున్నారని చెప్పారు. ప్రతిపక్షం, కాంగ్రెస్ పక్షం పరస్పరం తమకు అండ ఉందని భావించి ఇద్దరు మంత్రుల విషయంలో పాటించిన నీతి మిస్ ఫైర్ అవుతుందని గట్టు తెలిపారు. చంద్రబాబు మాటలు విని మంత్రులను కాంగ్రెస్ అధిష్ఠానం బలిచేసిందన్నారు. జీవోల అంశం ఉమ్మడి బాధ్యతని హైకోర్టులో చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. జగన్మోహన్ రెడ్డిగారిని ఇరుకున పెట్టడం కోసం, జీఓలు తప్పని చెప్పుకుంటూ డ్రామాలాడుతోందన్నారు. మంత్రులు బలయ్యారని రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి అన్నారనీ, బీసీ మంత్రి మోపిదేవి వెంకట రమణ అరెస్టయినప్పుడు ఆయనకు ఈ విషయం గుర్తురాలేదా అని ప్రశ్నించారు. కళంకితం అనుకుంటే క్యాబినెట్ రాజీనామా చేయలన్నారు.

వీకెండ్ పొలిటీషియన్ లోకేష్
చంద్రబాబు కుమారుడికి వీకెండ్ లో రాజకీయాలు జ్ఞాపకమొస్తాయన్నారు. ఆయనో పిల్లకాకి అన్నారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడతాడన్నారు. 'మీరు స్టాన్‌ఫోర్డు యూనివర్శిటీలో చదివిన మీకు పదో తరగతిలో ఎన్ని మార్కులొచ్చాయో చెప్పాలన్నారు. జిమ్యాట్‌లో వచ్చిన ర్యాంకు ఎంతో చెబితే నీ తెలివితేటలు బయటపడతాయని సవాలు చేశారు. ఆయన కంప్ట్రోలర్ అనే పదాన్ని కౌంటర్ అని పలుకుతారన్నారు. రాజకీయం అంటే తెలియదన్నారు. రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని హెరిటేజ్ డెయిరీని నిర్వహించడం తప్ప ఆయనకేం తెలుసని ప్రశ్నించారు. 1994లో చంద్రబాబు ముఖ్యమంత్రయిన తర్వాత హెరిటేజ్ డెయిరీకి 14 సంవత్సరాల పన్నును మాఫీ చేసిన విషయం గుర్తుందా అని అడిగారు. మిగిలిన 14 సంవత్సరాలకు రీషెడ్యూలు చేయించుకున్న విషయం గుర్తుందా అని నిలదీశారు. ఇది క్విడ్ ప్రోకో కాదా అని ప్రశ్నించారు. ఈ షేర్లన్నీ నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టి, ఆయనకు లాభాలివ్వకుండా పార్లమెంటు సీటు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. క్విడ్ ప్రోకో అంటే ఇదన్నారు. ఇటీవలి అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు ఈపాటికి జైల్లో ఉండి ఉండేవాడన్నారు. ప్రభుత్వం పడిపోయిన వెంటనే ఆయనపై సీబీఐ విచారణ జరిగేదన్నారు. అవిశ్వాసానికి మద్దతివ్వలేదు కాబట్టే చంద్రబాబును సీబీఐ ముద్దుబిడ్డలా కాపాడుతోందన్నారు.

చంద్రబాబు విషయంలో సిబ్బంది లేదన్న సీబీఐ జగన్మోహన్ రెడ్డి గారి అంశానికొచ్చేసరికి 29 బృందాలను ఏర్పాటుచేసి, 65 సంస్థలపై ఒకే రోజున దాడులు చేయలేదా? చంద్రబాబు మద్దతిస్తున్నందునే ఆయనపై సీబీఐ చర్యలు తీసుకోవడం లేదనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదన్నారు. సమస్యలను పరిష్కరించాలని తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ రాష్ట్రపతిని కలిసొస్తే లాలూచీ పడ్డారని చంద్రబాబు అన్నారనీ, ఇప్పుడు మీరు ఏం లాలూచీ పడ్డారని గట్టు నిలదీశారు. ఏం ఒప్పందం చేయమని రాష్ట్రపతిని కోరారని ప్రశ్నించారు. ప్రజల వద్దకు వెళ్ళి అభిమానం పొందాల్సిన పార్టీలు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడమంత నీచత్వం లేదని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. పాలక, ప్రతిపక్షాలు ఒకటి కావడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా చూడమన్నారు.

Back to Top